icon icon icon
icon icon icon

ఒక్క పింఛనుదారు మరణించినా జగన్‌దే బాధ్యత

పింఛన్‌ నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయడం ద్వారా..మండుటెండలో వృద్ధులు, దివ్యాంగులను బ్యాంకుల చుట్టూ తిప్పి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 30 Apr 2024 06:14 IST

సీఈవోకు తెదేపా నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పింఛన్‌ నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయడం ద్వారా..మండుటెండలో వృద్ధులు, దివ్యాంగులను బ్యాంకుల చుట్టూ తిప్పి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల ఈ సారి ఏ పింఛనుదారుడు మరణించినా దానికి సీఎం జగన్‌దే బాధ్యతని పేర్కొన్నారు. వైకాపాకు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డి, సెర్ప్‌ సీఈఓ మురళీధర్‌రెడ్డి ఈ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు అందజేయాలని, మహారాష్ట్రలో ఎన్నికల విధులకు వెళ్లిన వెయ్యి మంది ఆంధ్ర స్పెషల్‌ పోలీసులకు పోస్టల్‌ బ్యాలట్‌  కల్పించాలని, వైకాపా వారు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నా పట్టించుకోని పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్‌మీనాకు తెదేపా నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, మన్నవ సుబ్బారావు, వేపాడ చిరంజీవిరావు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ‘రాప్తాడు నియోజకవర్గంలో తెదేపాను వీడి వైకాపాలోకి రావాలని ఒత్తిడి చేస్తూ ఇద్దరు ఎస్సీ యువకులను వైకాపా వారు చావగొట్టి..స్థానిక ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. ఇదేంటని ప్రశ్నించిన బీసీ నాయకుడిపై దాడి చేశారు. ఇప్పటి వరకు నాలుగు తెదేపా ప్రచార వాహనాలను తగలబెట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు’ అని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల సమస్యపై కేంద్ర పోలీసు పరిశీలకులకు ఫిర్యాదు చేయనున్నట్టు దేవినేని ఉమా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img