icon icon icon
icon icon icon

బీసీవైపీ కార్యకర్తలపై దాడి ఘటనలో.. రామచంద్రయాదవ్‌పైనే హత్యాయత్నం కేసు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం చిత్తూరు జిల్లా సదుం మండలం యర్రాతివారిపల్లెలో సోమవారం బీసీవై పార్టీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడి చేసిన ఘటనలో బాధితుడైన రామచంద్రయాదవ్‌పైనే పోలీసులు కేసు పెట్టారు.

Published : 01 May 2024 06:02 IST

ఫిర్యాదులు చేసింది.. కేసులు కట్టింది పోలీసులే!

ఈనాడు, చిత్తూరు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం చిత్తూరు జిల్లా సదుం మండలం యర్రాతివారిపల్లెలో సోమవారం బీసీవై పార్టీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడి చేసిన ఘటనలో బాధితుడైన రామచంద్రయాదవ్‌పైనే పోలీసులు కేసు పెట్టారు. ఆయనతో పాటు మరో ఏడుగురు, మరికొందరు.. అధికార పార్టీ కార్యకర్తలను హత్య చేసేందుకు యత్నించారని అభియోగం మోపారు. ఎన్నికల సమయంలో పుంగనూరు నియోజకవర్గంలో బీసీవైపీ తరఫున ఏజెంట్లు ఉండకూడదనే ఉద్దేశంతో ఎఫ్‌ఐఆర్‌లో ‘ఇతరులు’ అని నమోదు చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. యర్రాతివారిపల్లె ఘటనలో వేణురెడ్డి అనే వైకాపా కార్యకర్తపై రామచంద్రయాదవ్‌, మరికొందరు హత్యాయత్నం చేశారని సదుం ఎస్సై మారుతి ఫిర్యాదు చేశారు. సాధారణంగా ఘర్షణల్లో ఎవరైనా గాయపడితే బాధితుడు.. లేదా అతని బంధువులు ఫిర్యాదు చేస్తారు. ఇక్కడ మాత్రం వైకాపా కార్యకర్తపై దాడి జరిగినందున కేసు నమోదు చేయాలని ఎస్సై కోరడం , ఆయనే కేసు పెట్టడం గమనార్హం. ఈ దాడిలో తనకు కూడా గాయాలయ్యానని ఎస్సై పేర్కొన్నారు. ఫిర్యాదుకు ఎవరూ ముందుకు రానందున తానే ఇచ్చానని రాశారు. బీసీవైపీ శ్రేణులపై పెట్టిన మరో కేసులోనూ స్థానిక హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనూ రామచంద్రతోపాటు మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. ఘర్షణలో వైకాపా కార్యకర్తలైన రాజన్న, ఆవుల మణి, వెంకటరమణ, గురుమూర్తి, మనోహర్‌, ఇతరులు బీసీవైపీ కార్యకర్తలపై హత్యకు యత్నించారంటూ ఓ కేసు నమోదు చేశారు. ఏఎస్సై షమీర్‌ బాషా ఈ ఫిర్యాదు ఇచ్చారు. కాగా, ఈ ఘటనకు ప్రధాన కారకుడైన మంత్రి పెద్దిరెడ్డి బంధువు వేణురెడ్డి పేరును పోలీసులు ప్రస్తావించలేదు.

ఘర్షణలో గాయపడ్డ బాధితులు పుంగనూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు తీసుకెళ్లారని బీసీవైపీ నాయకులు ఆరోపించారు.మరోవైపు చిలకపాటివారిపల్లెలో బీసీవైపీ శ్రేణులకు ఆతిథ్యమిచ్చిన ఆనందరెడ్డి అనే వ్యక్తి ఇంటికి వైకాపా కార్యకర్తలు నిప్పుపెట్టిన ఘటనపై పోలీసులు కేసు పెట్టారు.

అనంతపురం రేంజి డీఐజీ అమ్మిరెడ్డి మంగళవారం మధ్యాహ్నం యర్రాతివారిపల్లెకు వచ్చారు. ఘర్షణ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.


నా హత్యే పెద్దిరెడ్డి లక్ష్యం: రామచంద్రయాదవ్‌

పుంగనూరు, న్యూస్‌టుడే: మంత్రి పెద్దిరెడ్డి ఓటమిని ఎవరూ తప్పించలేరని రామచంద్ర యాదవ్‌ పేర్కొన్నారు. సోమవారం అర్ధరాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడారు. గ్రామాల్లో బీసీవైపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే పెద్దిరెడ్డి కుటుంబసభ్యులు ముందస్తు ప్రణాళికతో కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారని వివరించారు. తనను హత్య చేయడమే వారి లక్ష్యమని ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img