icon icon icon
icon icon icon

మట్టి మాఫియాపై.. తిరగబడ్డ వైకాపా నాయకుడు

కృష్ణా జిల్లా పామర్రు వైకాపా ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి కైలే అనిల్‌కుమార్‌ను మట్టి అక్రమ తవ్వకాలపై..సొంత పార్టీ నాయకులే నిలదీసిన ఘటన తాజాగా వెలుగుచూసింది.

Updated : 01 May 2024 08:32 IST

అధికార పార్టీ ఎమ్మెల్యేను నిలదీసిన అనుచరుడు
సమాధానం చెప్పలేక.. జారుకున్న కైలే అనిల్‌

ఈనాడు, అమరావతి -న్యూస్‌టుడే, పామర్రు గ్రామీణం: కృష్ణా జిల్లా పామర్రు వైకాపా ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి కైలే అనిల్‌కుమార్‌ను మట్టి అక్రమ తవ్వకాలపై..సొంత పార్టీ నాయకులే నిలదీసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. కైలే అనిల్‌ రెండు రోజుల క్రితం పామర్రు మండలం పెదమద్దాలిలో ఎన్నికల ప్రచారం చేస్తూ.. రాత్రి 10 గంటల తరవాత గ్రామానికి వచ్చారు. స్థానికంగా ఉన్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న వైకాపా స్థానిక నాయకుడు యారం ప్రసాద్‌ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. మట్టి మాఫియా విషయంలో తాను ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదంటూ  బహిరంగంగా నిలదీశారు. తనకు సమాధానం చెప్పాకే.. అంబేడ్కర్‌ విగ్రహానికి దండ వేయాలంటూ పట్టుపట్టారు. ఎమ్మెల్యేపై యారం ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మా చెరువు తవ్వేసి మట్టి ఎత్తుకుపోతున్నారని  మీకే చెప్పాను. కానీ.. మీరేమన్నారు. సంపాదించుకునే వాళ్లపై పడి ఏడుస్తున్నావెందుకు అంటూ నాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఈ ఐదేళ్లలో ఏమీ చేయలేదు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాకే.. అంబేడ్కర్‌ విగ్రహానికి దండలు వేయండి’ అంటూ అడ్డుకున్నారు. దీంతో  ఏం సమాధానం చెప్పాలో తెలియక.. ఎమ్మెల్యే అనిల్‌ దిక్కులు చూస్తూ నిలబడిపోవడం గమనార్హం. ఈ నిలదీతను.. వైకాపా నాయకులే వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పది రోజుల కిందట కూడా పామర్రు మండలం పసుమర్రులో ఎమ్మెల్యే అనిల్‌ ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. గ్రామ పెద్ద అడ్డుకొని నిలదీశారు. ఈ ఐదేళ్లలో తమ ఊరికి ఏంచేశారో చెప్పాలంటూ.. నిలదీయగా ఏమీ చెప్పలేక అనిల్‌ అక్కడి నుంచి జారుకున్నారు. కొమరవోలులో అంబేడ్కర్‌ జయంతి రోజున ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు ఎమ్మెల్యే అనిల్‌ రాగా.. మా ఊరికి ఏం చేశారో చెప్పమంటూ వైకాపాకు చెందిన మాల సామాజిక వర్గం నాయకులు నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img