icon icon icon
icon icon icon

సీఎం జగన్‌కు షర్మిల ‘నవ’ ప్రశ్నలు

న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తుంటే.. హంతకులకు మళ్లీ పట్టం కడుతుంటే చూస్తూ ఊరుకోవాలా?, న్యాయం జరగకపోతే ఆవేశం రాదా?.. అన్యాయం జరుగుతుంటే గుండె మండదా?.. అంటూ సీఎం జగన్‌ను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.

Updated : 02 May 2024 06:33 IST

హంతకులను అందలం ఎక్కిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?

ఈనాడు, కడప: న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తుంటే.. హంతకులకు మళ్లీ పట్టం కడుతుంటే చూస్తూ ఊరుకోవాలా?, న్యాయం జరగకపోతే ఆవేశం రాదా?.. అన్యాయం జరుగుతుంటే గుండె మండదా?.. అంటూ సీఎం జగన్‌ను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతోందని, ఎంపీగా గెలిపిస్తే కేంద్ర మంత్రిని అవుతానన్నారు. వైఎస్సార్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలం వడ్డమాను గ్రామం నుంచి బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.  పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు బహిరంగ సభల్లో మాట్లాడారు. ఎంపీ అవినాష్‌రెడ్డి కిల్లర్‌ అని, ఆయన ఎప్పుడైనా కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం కొట్లాడారా? అని షర్మిల ప్రశ్నించారు. చిన్నాన్న హత్య కేసులో నిందితుడని తెలిసీ జగన్‌ ఆయన్ను మళ్లీ చట్టసభలకు పంపాలని చూస్తున్నారని విమర్శించారు. ‘రాష్ట్రానికి పట్టుమని పది పరిశ్రమలూ తీసుకురాలేదు. ఉద్యోగాలంటూ యువతను మోసం చేశారన్నారు. జగన్‌కు ఏ వర్గం మీదా ప్రేమ లేదు. ఆయనో కుంభకర్ణుడు. నాలుగున్నరేళ్లుగా నిద్రపోయి ఇప్పుడు లేచి.. ‘సిద్ధం’ అంటూ హడావుడి చేస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. ‘వివేకాను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వాళ్లు, హంతకులను కాపాడే వాళ్లు అవసరమా? బద్వేలు నియోజకవర్గానికి రూ.500 కోట్లు ఇస్తామని జగన్‌ మోసం చేశారు. సోమశిల ఎత్తిపోతల పథకం ద్వారా 40 వేల ఎకరాలకు సాగు నీరిస్తామని పట్టించుకోలేదు. సొంత జిల్లాకే న్యాయం చేయని వ్యక్తి అవసరమా?’ అని ప్రశ్నించారు. న్యాయానికి, నేరస్థులకు మధ్య జరుగుతున్న పోరులో ధర్మం వైపు నిలబడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

వీటికి జవాబు చెప్పాకే ఓట్లు అడగాలని సవాలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దళిత, గిరిజనుల సంక్షేమం కోసం గత ప్రభుత్వ హయాంలో అమలైన 28 పథకాలను అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు చేసిన అన్యాయాలంటూ ‘నవ న్యాయ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు 9 ప్రశ్నలు సంధిస్తూ బుధవారం బహిరంగ లేఖ రాశారు. సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సమాధానాలు చెప్పాకే ఓట్లు అడగాలని డిమాండు చేశారు. లేకుంటే ఓట్లు అడిగే నైతిక హక్కు వైకాపాకు లేదన్నారు.

షర్మిల సంధించిన 9 ప్రశ్నలు

1 . ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను మీ ప్రభుత్వం ఇతర అవసరాలకు దారి మళ్లించడం నిజం కాదా?
2 . భూమిలేని పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సాగు కోసం భూమినిచ్చే కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారు?
3 . వెట్టి, జోగిని వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయింది?
4 . విదేశాల్లో చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సాయం కోసం చేపట్టిన పథకానికి అంబేడ్కర్‌ పేరును ఎందుకు తొలగించారు? వేరొకరి పేరు ఎందుకు పెట్టారు?
5 . దళిత, గిరిజన సిటింగ్‌ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందికి ఈ ఎన్నికల్లో టికెట్లు ఎందుకు నిరాకరించారు? ఇది వివక్ష కాదా?
6 . ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం అమలైన 28 పథకాలను ఎందుకు ఆపేశారు?
7 . 2021లో హత్యలు, అత్యాచారాలు, దాడులు అసాధారణంగా పెరిగినట్టు మీ ప్రభుత్వమే కేంద్రానికి నివేదించింది నిజం కాదా?
8 . దళిత డ్రైవర్‌ను దారుణంగా హతమార్చి, మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన కేసులో మీ పార్టీ ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు?
9 . ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లకు నిధులివ్వక వాటిని నిర్వీర్యం చేసి, విద్యార్థుల జీవితాలను అంధకారం చేసింది నిజం కాదా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img