icon icon icon
icon icon icon

జగన్‌ మానసిక పరిస్థితి ఆందోళనకరం

సీఎం జగన్‌ మానసిక పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్‌ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా తెదేపా అధినేత చంద్రబాబే కారణమంటున్నారని మండిపడ్డారు.

Published : 05 May 2024 05:20 IST

సీఎంకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది
దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఘాటు విమర్శలు

ఈనాడు, కడప: సీఎం జగన్‌ మానసిక పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్‌ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా తెదేపా అధినేత చంద్రబాబే కారణమంటున్నారని మండిపడ్డారు. జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని ఎద్దేవా చేశారు. కడపలో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జగన్‌ ఏ స్థాయి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గమనించాలని కోరారు. తాను చంద్రబాబుతో చేతులు కలిపినట్లు నిరూపించాలని డిమాండు చేశారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. వివేకా హత్యకేసులో చంద్రబాబు హస్తం ఉందని జగన్‌ ఆరోపించారు. సీబీఐ విచారణ కోరారు. సీఎం అయ్యాక సీబీఐ విచారణ అక్కర్లేదన్నారు. చంద్రబాబు హస్తం ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడారు?’ అని షర్మిల ఎద్దేవా చేశారు. తన కుమారుడి వివాహానికి పిలిచేందుకు చంద్రబాబును కలిశానని, తర్వాత మళ్లీ కలిసిందిలేదని స్పష్టంచేశారు. సునీత తన తండ్రి వివేకా హత్యకు సంబంధించి న్యాయం కోసం పోరాడుతుంటే.. ఆమె కూడా చంద్రబాబుతో చేతులు కలిపిందంటూ దారుణంగా విమర్శిస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ‘సీఎం జగన్‌కు ఓ అద్దం పంపుతున్నా. ఆయన ఆ అద్దంలో చూసుకుంటే తన ముఖం కనిపిస్తుందో... చంద్రబాబు కనిపిస్తారో చెప్పాలి’ అని షర్మిల ఎద్దేవా చేశారు.  ‘చంద్రబాబు చెబితేనే నీ కోసం 3,200 కి.మీ. పాదయాత్ర చేశానా? బై బై బాబు అనే క్యాంపెయిన్‌లో పాల్గొన్నానా?’ అని జగన్‌ను షర్మిల ప్రశ్నించారు. ‘నేను వైఎస్‌ఆర్‌ బిడ్డను.. నేను ఎంత మొండిదాన్నో జగన్‌కూ తెలుసు. నేను ఎవరో కంట్రోల్‌ చేస్తే తిరిగే వ్యక్తిని కాదు’ అని స్పష్టంచేశారు.

వైఎస్‌ఆర్‌ పేరును చేర్పించింది పొన్నవోలు..

జగన్‌పై అక్రమాస్తుల కేసు వేసింది.. మాజీ మంత్రి శంకర్రావని.. కానీ ఆయన కేసు చెల్లలేదని షర్మిల గుర్తుచేశారు. ఈ కేసులో తెదేపా నేత ఎర్రన్నాయుడు ఇంప్లీడ్‌ అయ్యారని, ఆ తర్వాత కేసు విచారణ ముందుకు సాగిందని వివరించారు. శంకర్రావు కానీ, ఎర్రన్నాయుడు కానీ వైఎస్‌ఆర్‌ పేరును కేసులో చేర్చలేదని స్పష్టంచేశారు. అక్రమాస్తుల కేసు నుంచి బయటపడాలంటే ఛార్జిషీట్‌లో వైఎస్‌ఆర్‌ పేరునూ చేర్చాలని జగన్‌ భావించారని, ఈ మేరకు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు వెళ్లి మరీ చేర్పించారని గుర్తుచేశారు. జగన్‌ సీఎం అయ్యాక పొన్నవోలుకు అదనపు అడ్వొకేట్‌ పదవి ఇచ్చింది అందుకేనని చెప్పారు. ‘వైఎస్‌ఆర్‌పై కాంగ్రెస్‌ కేసు పెట్టిందని మొదట్లో నేను కూడా అనుకున్నాను. సోనియాగాంధీని కలిసిన తర్వాత అసలు విషయం తెలిసింది. మేమెందుకు కేసు పెడతామని సోనియా అన్నారు’ అని షర్మిల వివరించారు. ఈ మధ్య ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను కలిసినప్పుడు కూడా ఛార్జిషీట్‌లో వైఎస్‌ఆర్‌ పేరును జగనే చేర్పించారని చెప్పినట్లు షర్మిల వెల్లడించారు. వైఎస్‌ఆర్‌ మరణం వెనుక రిలయన్స్‌ హస్తం ఉందని జగన్‌ అప్పట్లో ఆరోపించారని, వైకాపా వారు ఆ సంస్థ ఆస్తుల్ని ధ్వంసం చేశారని గుర్తుచేశారు. తాను సీఎం అయ్యాక రిలయన్స్‌ చెప్పిన వారికి రాజ్యసభ సీటు ఇచ్చి.. ఆ సంస్థపై తాను చేసిన ఆరోపణలు అబద్ధమని జగన్‌ నిరూపించుకున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img