Canada: నేను చేస్తే రైట్‌... నువ్వు చేస్తే రాంగ్‌..!

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అడ్డుకుంటామని కెనడా తదితర దేశాలు చెబుతుంటాయి. అయితే, భారత్‌ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఖలిస్థాన్‌ ఉగ్రవాదులకు రెడ్‌కార్పెట్‌ వేసిన కెనడా వైఖరిని చూసి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోతోంది.

Updated : 25 Sep 2023 17:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: ఉగ్రవాదం (Terrorism) ఏ రూపంలో ఉన్నా.. దాన్ని సహించబోమని, అడ్డుకుంటామని కెనడా (Canada) తదితర దేశాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటాయి. అయితే, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు వ్యతిరేకంగా.. తమ దేశాన్ని వేదికగా చేసుకొని ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల (Khalistan Terrorists)కు మాత్రం రెడ్‌కార్పెట్‌ వేసిన కెనడా వైఖరిని చూసి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోతోంది.

నిజ్జర్‌ ఒక్కడే కాదు.. వందలమంది ఉన్నారు!

ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ను ఇటీవల కెనడాలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. దీనిపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మాట్లాడుతూ.. ఇందులో భారత హస్తం ఉందని ఆరోపించారు. అయితే భారత్‌ ఈ ఆరోపణలను తిప్పికొట్టింది. భారత్‌లో పలు ఉగ్రవాద చర్యలకు పాల్పడిన ఉగ్రవాదులు దొంగతనంగా ఇక్కడి నుంచి పారిపోయి కెనడాలో ఆశ్రయం పొందడం గమనార్హం. కేవలం నిజ్జర్‌ మాత్రమే కాదు.. వందలమంది భారత వ్యతిరేక ఉగ్రవాదులు అక్కడ ఉన్నట్టు సమాచారం. వీరంతా కెనడా పౌరులుగా చెలామణి అవుతూ భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నా కెనడా యంత్రాంగం పట్టించుకోకపోవడం గమనార్హం.

కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదికి.. లష్కరేతో సంబంధాలు..?

అమెరికా నేతృత్వంలో ఉగ్రవాదంపై పోరులో భాగంగా అఫ్గానిస్థాన్‌లో అల్‌ఖైదా ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో నాటో దళాలు ఆ దేశంపై విరుచుకుపడ్డాయి. లాడెన్‌,(పాక్‌లో ఆశ్రయం పొందుతుండగా) అల్‌ జవహరి.. తదితర ఉగ్రనేతలను మట్టుబెట్టాయి. ఇదే కోవలో నిజ్జర్‌ హతమైతే పాశ్చాత్య దేశాలకు ఎందుకంత ఉలుకో అర్థం కావడం లేదని భారత రక్షణరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘నిజ్జర్‌ అనే ఉగ్రవాది భారత్‌లో అనేక నేరాలకు పాల్పడ్డాడు. అతడి సారథ్యంలో జరిగిన దాడుల్లో అనేకమంది సామాన్యులు చనిపోయారు. మరి ఇలాంటి ఉగ్రవాది గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో చనిపోతే భారత్‌కు ఆపాదించడమేంట’ని ప్రశ్నిస్తున్నారు.

భారత్‌ కంటే కెనడాకే ప్రమాదం!

ఉగ్రవాదం అనేది ఒక విష సర్పం. దానికి పాలు పోసి పెంచితే పెంచినవారినే కాటేస్తుంది. దీనికి ఉదాహరణ పాకిస్థాన్‌. అనేక దశాబ్దాలుగా భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్ర మూకలను ప్రోత్సహించిన పాక్‌లో నేడు ఆ మూకలే మారణహోమం సృష్టిస్తున్నాయి. ఆర్థికంగా దివాలా తీసేందుకు పాక్‌ సిద్ధంగా ఉంది. అన్ని విధాలుగా నష్టపోయిన పాక్‌ను చూసి కెనడాతోపాటు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా పైకి చెప్పుకొనే పాశ్చాత్య దేశాలు పాఠాలు నేర్చుకోవాల్సివుంది.

మనతో వైరం వారికే నష్టం..

అంతర్జాతీయంగా పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. పాశ్చాత్య ఆధిపత్యం అస్తమిస్తోంది. నూతన తేజంతో భారత్‌ ప్రపంచ అగ్ర ఆర్థిక శక్తుల్లో ఒకటిగా అడుగులేస్తోంది. ఆర్థికంగానూ, సైనికంగా భారత్‌ సూపర్‌పవర్‌గా మారుతోంది. ఇంతటి పెద్దదేశంతో వైరం అంటే ఇతర దేశాలకు నష్టమే. వీటిని గ్రహించి కెనడా సహా పాశ్చాత్య దేశాలు భారత్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించడంతోపాటు భారత వ్యతిరేక శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని