Published : 02 Jan 2021 20:41 IST

పచ్చబొట్టు.. పదికాలాలపాటు!

టాట్టూ వేసుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..

మనసులోని భావాలకు ఓ రూపం రావాలంటే టాట్టూ...

ఇష్టసఖులపై ప్రేమ చాటి చెప్పాలంటే టాట్టూనే...

ఆవేశం, అభిమానం.. ప్యాషన్‌.. అన్నింటికీ పచ్చబొట్టే యువతకు ఓ భావ వ్యక్తీకరణ మార్గం.

అంతలా కుర్రకారు మేనిని పెనవేసుకునే టాట్టూ కలకాలం నిలవలన్నా.. కలత పెట్టే మరకగా మారకుండా ఉండాలన్నా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే.


ఆల్కహాల్‌ అసలే వద్ద్దు

హ్యాంగోవర్‌లో ఉన్నప్పుడు, మద్యపానం సేవించినప్పుడు రక్తం త్వరగా పలచబడుతుంది. ఈ సమయంలో వేసుకుంటే చర్మంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. మనం వేసుకునే డిజైన్, మేనిపై ఇచ్చే చోటును బట్టి ఈ ప్రతికూలత ఎక్కువగా ఉండొచ్చు. టాట్టూ వేయించుకున్న చోట గాయాలైతే త్వరగా మానవు. అందుకే.. పచ్చబొట్టు వేయించుకునే 24 గంటల ముందు ఆల్కహాల్‌ తాగొద్దు. పెయిన్‌ కిల్లర్లు వాడొద్దు.

కడుపు నిండుగా
ఖాళీ కడుపుతో టాట్టూ వేయించుకోవడం అసలు మంచిది కాదు అంటారు వైద్యులు. ఆరోగ్యపరంగా దుష్ప్రభావాలు ఎదురవుతాయి. ఈ సమయంలో కడుపు నిండుగా కాకపోయినా కనీసం అల్పాహారమైనా భుజించాలి.

మనకేం కావాలో..
పచ్చబొట్టు ఒక్కసారి వేస్తే చెరిపేయడం చాలా కష్టం. స్పెల్లింగ్, గ్రామర్‌ తప్పుల్లేకుండా ముందే చూసుకోవాలి. మనకెలాంటి డిజైన్‌ కావాలో ముందే తేల్చుకోవాలి. టాట్టూ ఆర్టిస్టుల గురించి ఆరా తీయాలి. ఇంతకుముందు వాళ్ల పనితనం, నైపుణ్యం గురించి తెలుసుకోవాలి.

రక్షణ ముఖ్యం
పచ్చబొట్టు పొడిపించుకోవడం ఓ సుదీర్ఘ ప్రక్రియ. వారం రోజుల ముందే జాగ్రత్తలు మొదలవ్వాలి. చర్మం మృదువుగా, దృఢంగా తయారు కావడానికి కొద్దిరోజులు ముందు నుంచే మాయిశ్చరైజ్‌ చేయాలి. ఆ ప్రాంతంలో వెంట్రుకలు ఉంటే తొలగించాలి. సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడుతుండాలి. ఇవన్నీ తప్పనిసరిగా చేస్తేనే టాట్టూ తర్వాత కలిగే బాధ నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. తర్వాత ఎలాంటి ఉత్పత్తులు వాడాలో, ఏవి వాడకూడదో టాట్టూ ఆర్టిస్టుని అడిగి తెలుసుకోవాలి. 

అక్కడైతే వద్దు
పచ్చబొట్టు పదికాలాలు నిలిచి ఉండాలన్నా, ఆకట్టుకునేలా కనిపించాలనుకున్నా అది వేయించుకునే ప్రాంతం ముఖ్యం. అరచేతులు, వేళ్లలో అస్సలు వేయించుకోవద్దు. ఇక్కడైతే టాట్టూ ఎక్కువ కాలం నిలిచి ఉండదు. ఎముకలున్న చోట అయితే నొప్పి అధికంగా ఉంటుంది. నాభి, కండరాల్లాంటి విశాలమైన ప్రదేశాలు, కండపుష్టి ఉన్నచోట అయితే పచ్చబొట్టు అందంగా కనిపిస్తుంది. అధికకాలం నిలిచి ఉంటుంది.

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని