Updated : 21 Mar 2020 15:53 IST

కరోనా! అందరికి శాపం.. అతడికి వరం

కరోనా(కొవిడ్‌-19) వైరస్‌ వల్ల ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఎంతో మంది మృత్యువాతపడుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అందరికి కరోనా ఒక శాపంగా కనిపిస్తుంటే.. చైనాకి చెందిన ఓ వ్యక్తికి మాత్రం వరంగా మారింది. మతిమరుపుతో కుటుంబానికి దూరమైన అతను 30ఏళ్ల తర్వాత కరోనా కారణంగా మళ్లీ తన కుటుంబాన్ని కలవబోతున్నాడు. కరోనా ఏంటీ.. కుటుంబంతో కలపడమేంటని అనుకుంటున్నారా? అయితే పూర్తిగా చదవేయండి..

చైనాలోని గియిజు ప్రావిన్స్‌ చిషు గ్రామానికి చెందిన 57 ఏళ్ల జు జియామింగ్‌ 1990లో ఉపాధి వెతుక్కుంటూ హుబెయి ప్రావిన్స్‌కు వెళ్లాడు. అదే ఏడాది పని చేసే చోట జియామింగ్‌ ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. మెదడుకు దెబ్బ తగలడంతో గతం మర్చిపోయాడు. శారీరకంగా కోలుకున్నా.. అతడి గుర్తింపు కార్డు పోవడంతో నిలువ నీడ లేక.. ఉపాధి లేక నిరాశ్రయుడిగా మిగిలిపోయాడు. అయితే ఓ జంట అతడిని చేరదీసింది. వారి కుటుంబంలో ఒకడిగా చేర్చుకుంది. అయినా అతడు తన స్వగ్రామం, కుటుంబం, మర్చిపోయిన గతం గురించి తీవ్రంగా ఆలోచించేవాడు. ఎంత ప్రయత్నించినా గుర్తుకువచ్చేది కాదు. అయితే 2015లో వారంతా హిజియంగ్‌ ప్రావిన్స్‌లోని యునెకు మారారు. అది జియామింగ్‌ స్వగ్రామానికి 1500 కి.మీ దూరంలో ఉంది.

ఇటీవల చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. కరోనా సంబంధించిన వార్తలు ప్రజలను ఎప్పటికప్పుడు జాగృతి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కడెక్కడ కరోనా మరణాలు చోటు చేసుకున్నాయో వార్తలో వివరించారు. జియామింగ్‌ స్వగ్రామం చిషులోనూ ఒకరు కరోనాతో మృతి చెందినట్లు వార్తలో కనిపించింది. ఆ వార్త చూసిన జియామింగ్‌కు తన స్వగ్రామం గుర్తుకొచ్చింది. దీంతో గతం, కుటుంబం కూడా గుర్తుకొచ్చాయి. వెంటనే జియామింగ్‌ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. తనను తన కుటుంబంతో కలపమని కోరాడు. పోలీసులు జియామింగ్‌ గాథ విని స్పందించారు. అతడి కుటుంబ సభ్యుల చిరునామా, వివరాలు సేకరించారు. వీడియోకాల్‌ ద్వారా జియామింగ్‌ను తన తల్లితో మాట్లాడించారు.

ఇన్నాళ్లూ తన కుటుంబ పరిస్థితి ఎలా ఉందో జియామింగ్‌ తెలుసుకున్నాడు. అతడికి నలుగురు తోబుట్టువులు. 18 ఏళ్ల క్రితం అతడి తండ్రి మరణించాడు. జియామింగ్‌ ఆచూకీ లభించకపోవడంతో అతడి తల్లి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టారు. చాలా కాలం అతడి కోసం అన్వేషించినా ఫలితం లేకపోవడంతో కేసును కూడా కొట్టేశారు. ఇప్పుడు అతడి ఆచూకీ లభించడంతో కుటుంబమంతా సంతోషంతో ఉంది. తన కల నిజమైందని.. కుటుంబసభ్యులను కలవాలని ఆతృతతో ఉన్నట్లు జియామింగ్‌ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు జియామింగ్‌ను అతడి కుటుంబాన్ని కలిపే ప్రయత్నంలో ఉన్నారు.

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని