Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Nov 2022 17:04 IST

1. భారతీయులకు క్రమశిక్షణ నేర్పే పుస్తకమే రాజ్యాంగం: సీఎం జగన్‌

వేర్వేరు భాషలు, కులాలు, ప్రాంతాలు కలిగిన భారతదేశానికి క్రమశిక్షణ నేర్పే నిబంధనల పుస్తకమే రాజ్యాంగమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. సంఘ సంస్కరణల చరిత్రలో దీనికి ఎంతో ప్రాధాన్యముందని చెప్పారు. రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో కలిసి జగన్‌ పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మద్యం కుంభకోణం కేసు.. 3వేల పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేసిన ఈడీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తొలి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. మూడు వేల పేజీల ఛార్జిషీట్‌ను దిల్లీ రౌస్‌ అవెన్యూలోని ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించింది. ప్రస్తుతానికి ఇండో స్పిరిట్‌ యజమాని సమీర్‌ మహేంద్రుని నిందితుల జాబితాలో చేర్చిన ఈడీ.. మిగిలిన నిందితులపై త్వరలో ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఒకప్పటి పోరాట యోధులు.. ఇప్పుడు కనిపించని ఆ ముగ్గురు!

2017 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులను చూసిన వారికి మాత్రం ఈ మాటలు నమ్మశక్యంగా అనిపించవు. ఎందుకంటే మోదీ, అమిత్‌షా తప్ప మరే పేరూ వినిపించని గుజరాత్‌లో.. అప్పట్లో ఓ మూడు పేర్లు బలంగా వినిపించాయి. యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించేలా చేశాయి. వారే.. హార్దిక్‌ పటేల్‌, అల్పేష్‌ ఠాకూర్‌, జిగ్నేశ్‌ మేవానీ. వేర్వేరు సామాజిక నేపథ్యాలు.. వేర్వేరు ఉద్యమ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ముగ్గురూ.. అనూహ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలపై తమదైన ముద్ర వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 20లక్షల ఉద్యోగాలు.. KG-PG ఉచిత విద్య: గుజరాత్‌కు భాజపా వరాల జల్లు

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోన్న వేళ.. ప్రచార జోరు పెంచిన భారతీయ జనతా పార్టీ శనివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గుజరాత్‌ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. ఉచితాల జోలికి పెద్దగా వెళ్లని భాజపా.. అభివృద్ధే లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపింది. తమను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని, 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాషాయ పార్టీ హామీ ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కూచిపూడి నృత్యంతో అదరగొట్టిన రిషి సునాక్‌ కుమార్తె..

భారతీయ మూలాలు ఉన్న బ్రిటన్‌ నూతన ప్రధాని రిషి సునాక్‌కు మన దేశ సంస్కృతి, సంప్రదాయాలంటే అపారమైన అభిమానం. వీలు చిక్కినప్పుడల్లా దేవాలయాలను సందర్శించుకోవడంతో పాటు భారతీయ పండగలను రిషి కుటుంబం ఘనంగా చేసుకుంటుంది. తండ్రి బాటలోనే రిషి కుమార్తె కూడా భారతీయ కళల పట్ల మక్కువ చూపుతోంది. ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె అనౌష్క సునాక్.. మన సంప్రదాయ నృత్యాల్లో ఒకటైన కూచిపూడిలో శిక్షణ తీసుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారత్‌ మా దేశానికి రాకపోతే.. మేం కూడా.. : పాక్‌ ప్రణాళికలను వివరించిన రమీజ్‌ రజా

దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాక్‌తో.. భారత్‌ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. కేవలం ఐసీసీ ఈవెంట్లలో.. తటస్థ వేదికల్లో మాత్రమే పాక్‌తో టీమ్‌ఇండియా తలపడుతోంది. అయితే వచ్చే ఏడాది ఆసియా కప్‌ పాక్‌ వేదికగా జరుగుతుండటంతో.. ఈ టోర్నీలో భారత్‌ పాల్గొనడంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆమెకు నయన్‌ లక్షల్లో డబ్బు ఇచ్చింది: విఘ్నేశ్‌ శివన్‌ తల్లి

అగ్రకథానాయిక నయనతార గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు ఆమె అత్తయ్య, విఘ్నేశ్‌ శివన్‌ తల్లి మీనా కుమారి. నయన్‌-విఘ్నేశ్‌ వివాహమైన తర్వాత మొదటిసారి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కోడలు ఎంతో మంచిదని మెచ్చుకున్నారు. ‘‘మా అబ్బాయి విఘ్నేశ్‌ విజయవంతమైన దర్శకుడు. మా కోడలు నయనతార అగ్రకథానాయిక. వాళ్లిద్దరూ ఎంతో కష్టపడి పనిచేస్తారు. నా కోడలు బంగారు. మంచి మనసు ఉన్న వ్యక్తి’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ పునరావాస కేంద్రం భయంకరం.. పాకిస్థాన్‌లో కాబట్టే అలా: వసీమ్‌ అక్రమ్‌

పాకిస్థాన్‌ క్రికెట్ దిగ్గజం వసీమ్‌ అక్రమ్‌ మాజీ క్రికెటర్‌గా, ప్రస్తుత వ్యాఖ్యాతగా మనకు సుపరిచితుడే. కానీ తన జీవితంలోని చీకటి కోణాలను, అందులో నుంచి ఎలా బయటపడ్డాడో తెలియజేస్తూ జీవిత చరిత్రను ‘సుల్తాన్ ఏ మెమోయిర్’ పేరిట పుస్తకంగా ఇటీవల తెచ్చాడు. తన ఆటకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత సమాచారం కూడా ఇచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కాంగ్రెస్‌ హింసను ప్రోత్సహిస్తే.. భాజపా శాంతిని నెలకొల్పింది: అమిత్‌ షా

గుజరాత్‌లో అల్లర్లకు పాల్పడిన అసాంఘిక శక్తులకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఖేడా జిల్లాలోని మహుథాలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై అమిత్‌ షా విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌ మద్దతుతోనే గుజరాత్‌లో అసాంఘిక శక్తులు హింసను సృష్టించాయని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అదనపు బ్యాటర్‌కు బదులు.. హుడాను ఎందుకు తీసుకోలేదు?: మాజీ సెలెక్టర్

తొలి వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ.. కీలకమైన సమయంలో వికెట్లు తీయడంలో భారత బౌలర్లు విఫలకావడంతో ఓటమి తప్పలేదు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియాకు పార్ట్‌టైమ్‌ బౌలర్ కొరత తెలిసొచ్చింది. సదరు బౌలర్లను కొడుతున్నప్పటికీ అతడికే బంతిని ఇవ్వడం మినహా కెప్టెన్ శిఖర్ ధావన్‌ వద్ద మరో ఆప్షన్‌ లేకుండా పోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని