Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 11 Jul 2022 21:00 IST

1. రెయిన్‌ ఎఫెక్ట్‌... ఈనెల 13 వరకు పలు రైళ్లు రద్దు

భారీ వర్షాల దృష్ట్యా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఇన్‌ఛార్జి జనరల్‌ మేనేజర్‌ అరుణ్ కుమార్‌ జైన్‌ సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో పాటు విజయవాడ, గుంతకల్‌, గుంటూరు, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నాందేడ్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్లు వెబ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. భారీ వర్షాల సమయంలో ట్రాక్‌ నిర్వహణకు సంబంధించి కచ్చితంగా తనిఖీలు చేపట్టాలని, పరిస్థితుల తీవ్రతను పర్యవేక్షించాలని అధికారులకు, సిబ్బందికి జీఎం సూచించారు.

2. ఏక్‌నాథ్‌ శిందేలను తయారు చేసింది కేసీఆర్‌ కాదా?: రేవంత్‌రెడ్డి

అకాల వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అయినా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి. కానీ, ఈ విషయాన్ని గాలికొదిలేసి.. సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు దుర్యోధనుడు పూనినట్టు వ్యవహరించారని ఎద్దేవా చేశారు. 

3. జగన్‌ నొక్కే బటన్‌కు బ్యాటరీ ఇచ్చేది మోదీనే: జీవీఎల్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నొక్కే బటన్‌కు బ్యాటరీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేయాలంటూ ఈ నెల 14న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని జీవీఎల్‌ ప్రకటించారు. జగన్‌ను వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని విమర్శించారు.


Viral Video: వామ్మో.. ఇది ఆటోనా..పుష్పక విమానమా..?


4. తితిదే కీలక నిర్ణయాలు.. భక్తుల రద్దీ తగ్గాకే సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్లు

తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు పాల్గొని తితిదే ఉత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించి తీర్మానాలు ఆమోదించారు.  సమావేశం ముగిసిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5వరకు తిరుమాడ వీధుల్లో కరోనా తర్వాత మొదటి సారి నిర్వహించనున్నట్లు తెలిపారు.

5. టీమ్‌ఇండియా టీ20 ‘100’ మార్క్‌ వీరులు

వన్డేలు, టెస్టుల్లో సెంచరీలు కొట్టడం బ్యాట్స్‌మెన్‌కు సాధారణ విషయమే. అదే టీ20ల్లో కొట్టాలంటే అంత తేలికకాదు. ఇన్నింగ్స్‌ మొత్తంలోనే 120 బంతులు వేస్తే.. ఒక ఆటగాడు సెంచరీ చేయాలంటే ఎలా ఆడాలి? బౌలర్‌ ఎవరని చూడకుండా దొరికిన బంతిని దొరికినట్లు ఉతికారేయాలి. అలా ఆడితేనే టీ20ల్లో ‘100’ మార్క్‌ సాధ్యమవుతుంది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో యువ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సెంచరీ చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

6. ట్విటర్‌పై ఎలాన్‌ మస్క్‌ సెటైర్‌..!

ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ను కోలుగోలు చేస్తానని వ్యాపార వర్గాలకు కొద్ది నెలల క్రితం షాకిచ్చారు టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌. అదే రీతిలో ఆ కొనుగోలు డీల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అంతే ఆశ్చర్యపర్చారు. ఇప్పుడు దీనిపై ట్విటర్ యాజమాన్యం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి బోర్డు చర్యలు చేపట్టేందుకు యోచిస్తోందని ఆ సంస్థ ఛైర్మన్ బ్రెట్ టెయిలో పేర్కొన్నారు.  దీనిపై మస్క్ తనదైన శైలిలో స్పందించారు.

7. ఆ రోజున హాజరుకండి: సోనియాకు మరోసారి ఈడీ సమన్లు

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కొత్త తేదీని నిర్ణయిస్తూ.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి సోమవారం ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. జులై 21న ఆమె దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాలని వాటిలో పేర్కొంది. ఈ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీకి ఇది వరకే ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో కొద్దిరోజుల పాటు రాహుల్‌ను ప్రశ్నించింది.


Heavy Rains: ఉత్తరాంధ్రలో వర్షాల జోరు... నిండుకుండల్లా జలాశయాలు


8. ఈ దేశంలో.. వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇక ఉద్యోగి హక్కు..!

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కార్యాలయాల్లో పని విధానమే మారిపోయింది. వైరస్‌ బయటపడి రెండున్నరేళ్లు పూర్తైనా చాలా సంస్థలు ఇంటి నుంచి పనిచేసే  వెసులుబాటును ఉద్యోగులకు కల్పిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు మాత్రం కచ్చితంగా కార్యాలయానికి రావాలని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని ఉద్యోగి హక్కుగా మార్చేందుకు నెదర్లాండ్‌ సిద్ధమైంది. 

9. దేశం దివాలా తీయడానికి అధ్యక్షుడిదే బాధ్యత.. వారికి పాలించే నైతికత లేదు

ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలను ఎదుర్కొంటున్న శ్రీలంక పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది. విదేశీ సహాయం అంతంతమాత్రమే ఉండగా రుణాలు ఇవ్వడానికి అంతర్జాతీయ సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయి. ఇలా దేశం దివాలా తీసే పరిస్థితుల్లోకి జారుకోవడానికి అధ్యక్షుడు రాజపక్సదే బాధ్యత అని శ్రీలంకలోని ప్రముఖ చర్చి పెద్దలు ఉద్ఘాటించారు.

10. పిల్లలతో ఆందోళన.. చిక్కుల్లో ఆదిత్య ఠాక్రే..!

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తనయుడు, రాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే వివాదంలో చిక్కుకున్నారు. మెట్రో కార్‌ షెడ్‌ను తిరిగి ఆరే కాలనీలోనే నిర్మించేందుకు రాష్ట్ర నూతన ప్రభుత్వం చేపడుతోన్న చర్యలపై ఠాక్రే ఆందోళన చేపట్టారు. అయితే ఈ నిరసనల్లోకి చిన్నారులను తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌.. ఆదిత్యపై కేసు నమోదు చేయాలంటూ ముంబయి పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని