Twitter: ట్విటర్‌పై ఎలాన్‌ మస్క్‌ సెటైర్‌..!

ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ను కోలుగోలు చేస్తానని వ్యాపార వర్గాలకు కొద్ది నెలల క్రితం షాకిచ్చారు టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌. అదే రీతిలో ఆ కొనుగోలు డీల్‌ నుంచి తప్పుకుంటానని ప్రకటించి అంతే ఆశ్చర్యపర్చారు.

Published : 11 Jul 2022 19:44 IST

శాన్‌ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ను కోలుగోలు చేస్తానని వ్యాపార వర్గాలకు కొద్ది నెలల క్రితం షాకిచ్చారు టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌. అదే రీతిలో ఆ కొనుగోలు డీల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అంతే ఆశ్చర్యపర్చారు. ఇప్పుడు దీనిపై ట్విటర్ యాజమాన్యం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి బోర్డు చర్యలు చేపట్టేందుకు యోచిస్తోందని ఆ సంస్థ ఛైర్మన్ బ్రెట్ టెయిలో పేర్కొన్నారు.  దీనిపై మస్క్ తనదైన శైలిలో స్పందించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా తేలిగ్గా తీసుకొంటున్నట్లు మూడు రకాల ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ‘మొదట నేను ట్విటర్ కొనుగోలు చేయలేనన్నారు. తర్వాత వారు తమ నివేదికలో చెప్పినట్లుగా 5 శాతం కంటే తక్కువగా స్పామ్‌ ఖాతాలున్నట్లు చూపించలేదు. ఇప్పుడు కోర్టు ద్వారా నేను ట్విటర్ కొనుగోలు చేసేలా ఒత్తిడి చేయాలనుకుంటున్నారు’ అంటూ తన ట్విటర్ ఖాతాలో స్పందించారు.

ట్విటర్‌ను సొంతం చేసుకునేందుకు మస్క్‌ గతంలో 44 బిలియన్‌ డాలర్లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే, నకిలీ ఖాతాలకు సంబంధించి ట్విటర్‌ పూర్తి సమాచారం ఇవ్వలేదని, విలీన ఒప్పందంలోని పలు నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ట్విటర్‌లో చెప్పిన దానికంటే స్పామ్‌ ఖాతాలు నాలుగింతలు ఎక్కువగా ఉన్నాయంటోన్న ఆయన.. స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారం కచ్చితమైనదని భావించే తాను కొనుగోలు ఒప్పందానికి అంగీకరించినట్లు గతంలో పేర్కొన్నారు. ఆ విషయం తేలేవరకు కొనుగోలు ఒప్పందం ముందుకు వెళ్లదని ఎలాన్‌ మస్క్‌ పలుమార్లు స్పష్టం చేశారు. చెప్పినట్టుగానే ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నారు. అయితే, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఏదైనా కారణంతో మస్క్ లావాదేవీని పూర్తి చేయకపోతే బిలియన్‌ డాలర్లను బ్రేక్‌ అప్‌ ఫీజు(పెనాల్టీ) కింద చెల్లించాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని