Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Updated : 20 Jun 2022 17:00 IST

1. అగ్నివీరుల నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల

ఆర్మీలో అగ్నివీరుల  (Agniveer) నియామకాల కోసం భారత సైన్యం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందుకోసం జులై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. అగ్నివీరులుగా నియామకాలు చేపట్టే విభాగాలు, అందుకు కావాల్సిన అర్హతలను తాజా నోటిఫికేషన్‌లో వివరంగా పేర్కొంది. అంతేకాకుండా అగ్నివీరులకు ఇచ్చే వేతన ప్యాకేజీ, సెలవులు, సర్వీసు నిబంధనలకు సంబంధించి పూర్తి వివరాలను నోటిషికేషన్‌లో పొందుపరిచింది.

Harish Rao: డబుల్‌ గ్రోత్‌ అంటే రూ.500 పింఛనా..?: హరీశ్‌రావు

2. పిల్లలు సికింద్రాబాద్‌ వెళ్తున్నట్లు తెలియదు: తల్లిదండ్రుల ఆవేదన

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో తమ పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని నిందితుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు అల్లర్లతో ఎలాంటి సంబంధం లేదని, వారిని విడుదల చేయాలని కన్నీరుమున్నీరయ్యారు. వారు సికింద్రాబాద్‌కు వెళ్తున్నట్లు తమకు తెలియదన్నారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చంచల్‌గూడ జైలుకు చేరుకొని ములాఖత్‌లో వారి పిల్లలను కలుసుకున్నారు. 

3. సాయి డిఫెన్స్‌ అకాడమీలో ఇంటెలిజెన్స్‌ అధికారుల తనిఖీలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ (Agnipath) విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు కొనసాగుతోంది. అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ప్రకాశం జిల్లాకు చెందిన ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో సుబ్బారావు నిర్వహిస్తోన్న సాయి డిఫెన్స్‌ అకాడమీలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 

Viral Video: బైక్‌ రేసింగ్‌లో ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

4. హైకోర్టు వ్యాఖ్యలపై జగన్‌ ఏం సమాధానం చెబుతారు?: చంద్రబాబు

రాత్రిపూట కూల్చివేతల అంశంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్‌ ఏం సమాధానం చెబుతారని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తప్పుచేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘చలో నర్సీపట్నం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పలువురు తెదేపా నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేయడంతో పాటు గృహనిర్బంధాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల వైఖరిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

5. వర్షంలోనూ బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ఆందోళన

సమస్యలు పరిష్కరించాలంటూ నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన 7వ రోజుకు చేరింది. వర్షంలో తడుస్తూనే విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. వర్షంలో తడుస్తూ ట్రిపుల్‌ ఐటీ ప్రధాన గేటు వద్ద విద్యార్థులు కూర్చుండిపోయారు. డిమాండ్లపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక వివరణ, లేదా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి రాతపూర్వక హామీ ఇస్తే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు చెబుతున్నారు.

Agnipath: చైనాకు చెక్‌ పెట్టేందుకే.. అగ్నివీరులు!

6. ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ సర్కారు ఆమోదం

తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలలు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపుల తర్వాత బదిలీల కోసం వివిధ శాఖలపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ముఖ్యంగా ఉపాధ్యాయుల నుంచి పెద్ద ఎత్తువ అభ్యర్థనలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. వివిధ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం ఉద్యోగుల పరస్పర బదిలీలకు ఆమోదం తెలిపింది. 

7. ఎట్టకేలకు మార్కెట్లకు లాభాలు..

ఆద్యంతం ఊగిసలాట మధ్య చలించిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఎట్టకేలకు లాభాలతో ముగిశాయి. దీంతో వరుస ఆరు సెషన్ల భారీ నష్టాలకు బ్రేక్‌ పడినట్లయింది. ఉదయం ఊగిసలాట మధ్య ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. చివరి అరగంటలో కొనుగోళ్ల మద్దతుతో స్పష్టమైన లాభాల్లో ముగిశాయి.

8. గర్భిణుల నియామకాలకు నో.. ఇండియన్‌ బ్యాంక్‌కు నోటీసులు

మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు తన బ్యాంకులో చేరేందుకు తాత్కాలిక అనర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దిల్లీ మహిళా కమిషన్ ‌(డీసీడబ్ల్యూ) దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల పట్ల వివక్ష చూపించేలా ఉన్న ఈ కొత్త నియామక మార్గదర్శకాలను తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ ఇండియన్‌ బ్యాంక్‌కు డీసీడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది.

9. ‘ఎవరూ క్వీన్‌ విక్టోరియా కాదు..!’ కాంగ్రెస్‌ ఆరోపణలను తిప్పికొట్టిన భాజపా

నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో రాహుల్‌ గాంధీ ‘ఈడీ’ విచారణను నిరసిస్తూ.. కాంగ్రెస్‌ శ్రేణులు నేడు దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ‘ఈడీ’ని దుర్వినియోగం చేస్తోందని కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఈ ఆరోపణలపై తాజాగా భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా స్పందిస్తూ.. చట్టం ముందు అందరూ సమానులేనని వ్యాఖ్యానించారు.

10. మధ్యప్రదేశ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల హతం

మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులు-భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన మావోయిస్టుల్లో ఒక మహిళ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ముగ్గురి మావోలపై మొత్తంగా రూ.30లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని