Indian Bank: గర్భిణుల నియామకాలకు నో.. ఇండియన్‌ బ్యాంక్‌కు నోటీసులు

మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు తన బ్యాంకులో చేరేందుకు తాత్కాలిక అనర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి

Updated : 20 Jun 2022 17:32 IST

దిల్లీ: మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు తన బ్యాంకులో చేరేందుకు తాత్కాలిక అనర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దిల్లీ మహిళా కమిషన్ ‌(డీసీడబ్ల్యూ) దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల పట్ల వివక్ష చూపించేలా ఉన్న ఈ కొత్త నియామక మార్గదర్శకాలను తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ ఇండియన్‌ బ్యాంక్‌కు డీసీడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది.

ప్రీ-ఎంప్లాయ్‌మెంట్‌కు సంబంధించి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ మార్గదర్శకాలను ఇండియన్‌ బ్యాంకు ఇటీవల విడుదల చేసింది. ఎంపిక చేసిన పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన మహిళలు 12 వారాలు, అంతకుమించిన గర్భంతో ఉంటే తాత్కాలికంగా అనర్హులవుతారని అందులో పేర్కొంది. ప్రసవానంతరం ఆరు వారాలకు రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ వద్ద ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకుని, ధ్రువీకరణతో వస్తే నియామక ఉత్తర్వులు అందిస్తామని వెల్లడించింది. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఆలస్యంగా ఉద్యోగాల్లో చేరే గర్భిణులు సీనియార్టీ కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇండియన్‌ బ్యాంక్‌ మార్గదర్శకాలపై దిల్లీ మహిళా కమిషన్‌ సుమోటోగా చర్యలు చేపట్టింది. ‘‘ఇది పూర్తిగా వివక్షపూరితమైన, చట్టవిరుద్ధమైన నిర్ణయం. అంతేగాక, 2020 కోడ్‌ ఆఫ్‌ సోషల్‌ సెక్యూరిటీ చట్టం కింద ఉన్న మాతృత్వ ప్రయోజనాలకు విరుద్ధం. అంతేగాక, రాజ్యాంగ పరంగా ఉన్న ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘించినట్లే. మహిళలకు వ్యతిరేకంగా ఉన్న ఈ మార్గదర్శకాలను వెంటనే ఉపసంహరించుకోవాలి’’ అని డీసీడబ్ల్యూ నోటీసుల్లో పేర్కొంది. ఈ మార్గదర్శకాలను ఎలా రూపొందించారు..? ఎవరు ఆమోదించారు? వంటి పూర్తి వివరాలు జూన్‌ 23లోగా అందజేయాలని స్పష్టం చేసింది. అయితే ఈ నోటీసులపై ఇండియన్‌ బ్యాంక్‌ ఇంకా స్పందించలేదు.

మరోవైపు, ఈ వ్యవహారంపై డీసీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ గవర్నర్‌కు కూడా లేఖ రాశారు. మహిళలపై వివక్ష చూపించే, వారి హక్కులను ఉల్లంఘించేలా ఉన్న ఇలాంటి మార్గదర్శకాలను రూపొందించకుండా అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయాలని ఆమె కేంద్ర బ్యాంక్‌ను కోరారు. దీనికి బాధ్యులైన ఇండియన్‌ బ్యాంక్‌ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

కాగా.. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కూడా ఇలాగే 3 నెలల గర్భిణులు బ్యాంకులో చేరడానికి తాత్కాలిక అనర్హులని, ప్రసవానంతరం 4 నెలలకు విధుల్లో చేరొచ్చని గత జనవరిలో మార్గదర్శకాలు ఇచ్చింది. వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆ నిబంధనలను రద్దు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని