Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 04 Apr 2024 16:59 IST

1. అవనిగడ్డ, రైల్వే కోడూరు అభ్యర్థుల్ని ప్రకటించిన జనసేన

అవనిగడ్డ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్దప్రసాద్‌ పేరును ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఖరారు చేశారు. రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాకపోవడంతో అరవ శ్రీధర్‌ను ఎంపిక చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏఐ సిటీకోసం హైదరాబాద్‌లో 200 ఎకరాలు: మంత్రి శ్రీధర్‌బాబు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాకతో సాఫ్ట్‌వేర్‌ రూపురేఖలు సమూలంగా మారాయని, భవిష్యత్‌లో ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉంటాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. జులైలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై సదస్సు నిర్వహిస్తామని, ఏఐ సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించామని ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు

తెలంగాణ వ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బోరుబావిలో ఏడాదిన్నర చిన్నారి.. 20 గంటలు శ్రమించి రక్షించారిలా..!

కర్ణాటకలోని బోరుబావిలో పడిన ఏడాదిన్నర చిన్నారి కథ సుఖాంతమైంది. రెస్క్యూ సిబ్బంది 20 గంటలు శ్రమించి ఆ పసివాడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. విజయపుర జిల్లా ఇండి తాలూకా లచ్యాణా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియో కోసం క్లిక్‌ చేయండి 

5. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో శిశువు దుర్మరణం: బాధితులు తెలంగాణ వాసులు

అమెరికా(USA)లోని ఫ్లొరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ జంట తమ శిశువును కోల్పోయింది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన బొమ్మిడి అనూష, కొమ్మారెడ్డి సుశీల్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడాది వయసున్న వారి చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ₹కోటి పైన ఇళ్లకు గిరాకీ.. టాప్‌-3లో హైదరాబాద్‌!

కలల ఇంటిని సొంతం చేసుకునేందుకు ప్రజలు ఖర్చుకు వెనకాడడం లేదు. సౌకర్యాలు ఉంటే చాలు ధర రూ.కోటైనా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కోటి రూపాయలకు పైగా విలువ కలిగిన ఇళ్ల అమ్మకాలు దేశ రాజధాని ప్రాంతం దిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రాంతంలో జనవరి - మార్చి మధ్య 10,558 యూనిట్లు అమ్ముడయ్యాయి. తర్వాతి స్థానాల్లో  ముంబయి (7,401), హైదరాబాద్‌ (6,112) ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సిలబస్‌ మార్పు, కొత్త పాఠ్య పుస్తకాలపై NCERT కీలక ప్రకటన

కొత్త విద్యా సంవత్సరంలో సిలబస్‌ మార్పు, పాఠ్యపుస్తకాల విడుదలపై ఎన్‌సీఈఆర్టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) కీలక ప్రకటన చేసింది. 3, 6వ తరగతులకు మాత్రమే కొత్త సిలబస్‌తో పాఠ్య పుస్తకాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఓరి‘నరైనో’.. బ్యాటుతో రెచ్చిపోతున్న విండీస్ స్పిన్నర్

సునీల్ నరైన్.. ఈ పేరు చెబితే ఐపీఎల్ జట్లు బెంబేలెత్తిపోతున్నాయి. లోయరార్డర్ బ్యాటర్ అయిన అతను.. ఓపెనర్‌గా వచ్చి రెచ్చిపోతున్న తీరు అనూహ్యం. వరుసగా రెండో మ్యాచ్‌లో అతను బ్యాటుతో జట్టుకు విజయం సాధించిపెట్టడంతో రాబోయే మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లు అతడికి అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రచించాల్సిన పరిస్థితి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చంద్రయాన్‌-3 విజయంతో బిలియనీర్ల జాబితాలోకి.. ఎవరీ రమేశ్‌ కున్హికన్నన్‌..?

అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖిస్తూ గతేడాది భారత్‌ ప్రయోగించిన ‘చంద్రయాన్‌-3’ జాబిల్లి దక్షిణ ధ్రవంపై దిగ్విజయంగా దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ పేరు ప్రపంచమంతా మార్మోగింది. ఈ విజయం కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారవేత్తను బిలియనీర్‌గా చేసింది.  ఆయనే కేనెస్‌ టెక్నాలజీ వ్యవస్థాపకుడు రమేశ్‌ కున్హికన్నన్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.  ‘సోనియా గాంధీ ఆకాంక్షలకు రాహుల్ బాధితుడు’: కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీని ఉద్దేశించి.. నటి, మండి నియోజకవర్గ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఆకాంక్షలకు రాహుల్‌ బాధితుడయ్యారని అన్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈవిధంగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు