Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 15 Mar 2024 20:59 IST

1. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ

భారాస ఎమ్మెల్సీ కవిత(Kavitha)ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని 8మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండానే కవిత అరెస్టా?: కేటీఆర్‌

ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్టు చేస్తారని దర్యాప్తు అధికారిని కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘‘అరెస్టు చేయమంటూ సుప్రీం కోర్టుకు మాట ఇచ్చి.. ఇప్పుడు ఎలా అరెస్టు చేశారు? సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చిన మాట తప్పుతున్న ఈడీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాజకీయ కుట్రలో భాగమే ఎమ్మెల్సీ కవిత అరెస్టు: హరీశ్‌రావు

రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కవిత అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికం. అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇన్నాళ్లు విచారణకు కవిత సహకరించలేదు: కిషన్‌రెడ్డి

భారాస ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలపై కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకని ప్రశ్నించారు. ఈడీ విచారణకు కవిత సహకరించాలని సూచించారు. ఇన్నాళ్లు విచారణకు సహకరించకుండా కవిత తప్పించుకుని తిరిగారని విమర్శించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అన్ని రంగాల్లో ముస్లిం మైనారిటీలకు సముచిత స్థానం: సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ హయాంలో ముస్లిం మైనారిటీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన వరంగల్‌ భారాస ఎంపీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని భారాస ఎంపీ పసునూరి దయాకర్‌ కలిశారు. వరంగల్‌లో సిట్టింగ్‌ ఎంపీని పక్కన పెట్టి.. ఈసారి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు భారాస టికెట్‌ను కేటాయించింది. దీంతో అసంతృప్తితో ఉన్న దయాకర్‌ శుక్రవారం సీఎం రేవంత్‌ రెడ్డిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా తరలివచ్చిన అభిమానులు

భాజపా విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షో నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో పాటు పలువురు భాజపా నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్‌ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర సుమారు గంట సేపు ఈ యాత్ర కొనసాగింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ODI, T20ల్లో ‘స్టాప్‌ క్లాక్‌’ నిబంధన.. టీ20 ప్రపంచకప్‌ నుంచే అమల్లోకి..

క్రికెట్‌లో మరో కొత్త నిబంధన ప్రవేశపెట్టేందుకు ఐసీసీ (ICC) సిద్ధమైంది. ఇకపై వన్డేలు, టీ20ల్లో ‘స్టాప్‌ క్లాక్‌’ (Stop Clock) రూల్‌ను అమలుచేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉన్న ఈ నిబంధన జూన్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) టోర్నీ నుంచి పూర్తిస్థాయిలో అమలవుతుందని వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గూగుల్‌పై కాంపిటీషన్ కమిషన్‌ విచారణకు ఆదేశం

ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ (CCI) విచారణకు ఆదేశించింది. ప్లేస్టోర్‌ ధరల విధానంలో పోటీ వ్యతిరేక పద్ధతులు అవలంబిస్తుండడంపై ఈ ఆదేశాలు ఇచ్చింది. గూగుల్‌ ప్లేస్టోర్‌ నవీకరించిన చెల్లింపుల విధానం పోటీ చట్టానికి వ్యతిరేకంగా ఉందని పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. యడియూరప్పపై పోక్సో కేసు.. సీఐడీకి అప్పగింత

కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప (81) (Yediyurappa)పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఆయనపై నమోదైన పోక్సో (POCSO) కేసును తుదుపరి దర్యాప్తు నిమిత్తం క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌ (CID)కు బదిలీ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని