Aditya L1: 15 లక్షల కి.మీలు.. 127 రోజులు..! ‘ఆదిత్య ఎల్‌1’ ప్రయాణం సాగిందిలా..

సూర్యుడి దిశగా 127 రోజులపాటు ప్రయాణం సాగించిన ‘ఆదిత్య ఎల్‌1’.. నేడు లగ్రాంజ్‌ పాయింట్‌ చుట్టూ ఉన్న కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.

Published : 06 Jan 2024 20:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతరిక్ష రంగంలో భారత్‌ మరో ఘనత సాధించింది. సూర్యుడి (Sun)ని అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1 (Aditya-L1) తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్‌ పాయింట్‌ (Lagrange Point-1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశించింది. సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో (ISRO) చేపట్టిన తొలి మిషన్‌ ఇదే. రాకెట్‌ ప్రయోగం నుంచి ‘ఎల్‌1’ కక్ష్యలో చేరేవరకూ 127 రోజులపాటు సాగిన ‘ఆదిత్య ఎల్‌1’ ప్రయాణాన్ని పరిశీలిస్తే..

ఇస్రో మరో ఘనత.. లగ్రాంజ్‌ పాయింట్‌కు ఆదిత్య-ఎల్‌1: మోదీ ట్వీట్‌

  • సెప్టెంబరు 2, 2023: శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ‘పీఎస్‌ఎల్‌వీ సీ-57’ రాకెట్‌లో నింగికెగసిన ఆదిత్య ఎల్‌1. భూమి చుట్టూ 235 కి.మీ x 19500 కి.మీల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశం.
  • సెప్టెంబరు 3: మొదటి భూకక్ష్య పెంపు విన్యాసం. 245 x 22,459 కి.మీల కక్ష్యలో ప్రవేశించిన ఉపగ్రహం.
  • సెప్టెంబరు 5: రెండోసారి కక్ష్య పెంపుతో 282 x 40,225 కి.మీల భూకక్ష్యలోకి చేరిక.
  • సెప్టెంబరు 10: మూడో భూకక్ష్య పెంపు. ‘ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (ASPEX)’ పేలోడ్‌లోని సూపర్‌థర్మల్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ పార్టికల్‌ స్పెక్ట్రోమీటర్‌ (STEPS)ను యాక్టివేట్‌ చేశారు.
  • సెప్టెంబరు 18: నాలుగోసారి భూకక్ష్యను పెంచారు. ‘స్టెప్స్‌’ పరికరం శాస్త్రీయ సమాచార సేకరణ ప్రారంభించింది.
  • సెప్టెంబరు 19: ఐదోసారి కక్ష్యను పెంచి, సూర్యుడి దిశగా ట్రాన్స్‌-లగ్రాంజియన్‌ పాయింట్‌-1 ఇన్సర్షన్‌ విన్యాసం చేపట్టారు. దీంతో ‘ఎల్‌1’ వైపు ప్రయాణం మొదలైంది.
  • సెప్టెంబరు 25: ‘ఎల్‌1’ పాయింట్ చుట్టూ అంతరిక్ష పరిస్థితులను అంచనా వేశారు.
  • సెప్టెంబరు 30: భూ గురుత్వాకర్షణ పరిధిని విజయవంతంగా దాటిన ఉపగ్రహం.
  • అక్టోబరు 6: వ్యోమనౌక మార్గాన్ని సరిదిద్దే విన్యాసాన్ని (Trajectory Correction Maneuvre) చేపట్టారు.
  • నవంబర్ 7: తొలిసారి సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని క్లిక్‌మనిపించిన వ్యోమనౌక. ‘హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌’ (హెచ్‌ఈఎల్‌1ఓఎస్‌) ఈ ఘనత సాధించింది.
  • డిసెంబర్ 1: ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్ (ASPEX) పేలోడ్‌లోని రెండో పరికరం ‘సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ (SWIS)’ పనిచేయడం ప్రారంభం. ఇది సౌర గాలులను అధ్యయనం చేస్తోంది.
  • డిసెంబర్ 8: సోలార్‌ అల్ట్రావయొలెట్‌ ఇమేజింగ్‌ టెలీస్కోప్‌ (SUIT) పేలోడ్‌.. అతినీలలోహిత తరంగ దైర్ఘ్యం చేరువ నుంచి సూర్యుడి చిత్రాలను బంధించింది.
  • జనవరి 6, 2024: లగ్రాంజ్‌ పాయింట్‌ చుట్టూ ఉన్న కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన ఆదిత్య ఎల్‌1. ఇక్కడే ఉంటూ సూర్యుడిపై పరిశోధనలు చేస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని