Journalist Murder: జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ హత్య.. 15ఏళ్ల తర్వాత కీలక తీర్పు

Journalist Soumya Vishwanathan Murder: జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ హత్య కేసులో.. 15 ఏళ్ల తర్వాత ఐదుగుర్ని కోర్టు దోషులుగా తేల్చింది. ఈ మేరకు దిల్లీ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. 

Published : 18 Oct 2023 16:19 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో 15 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ప్రముఖ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ (Soumya Vishwanathan Murder Case) హత్య కేసులో దిల్లీ కోర్టు (Delhi Court) బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితుల్ని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. నలుగురు నిందితులు రవి కపూర్‌, అమిత్‌ శుక్లా, బల్జీత్‌ మల్లిక్‌, అక్షయ్‌ కుమార్‌ను హత్య, దోపిడీ అభియోగాల కింద దోషులుగా నిర్ధారించగా.. వారికి సాయం చేసిన అభియోగాలపై అజయ్‌ సేఠిని దోషిగా ప్రకటించింది. వీరికి త్వరలోనే శిక్ష ఖరారు చేయనుంది.

ఓ టీవీ ఛానల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్న సౌమ్య విశ్వనాథన్‌ (Soumya Vishwanathan) పదిహేనేళ్ల క్రితం దారుణ హత్యకు గురయ్యారు. 2008 సెప్టెంబరు 30వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆమె ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుండగా.. వసంత్‌ విహార్‌ ప్రాంతంలో ఆమె కారును నిందితులు అడ్డగించి దోపిడీకి యత్నించారు. అనంతరం ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఉదయానికి కారులో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

4.30 గంటలు డోర్‌ పట్టుకునే ఉన్నాం: హమాస్‌ దాడిని ప్రత్యక్షంగా చూసిన కేరళ మహిళ

తొలుత ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. అయితే పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆమె తలకు బుల్లెట్‌ గాయమైనట్లు తేలడంతో హత్యగా నిర్ధారించారు. అనంతరం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. ఆమె కారును మరో వాహనం అనుసరించినట్లు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 2009లో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. దోపిడీ కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అప్పటి నుంచి దీనిపై సుదీర్ఘ విచారణ జరగ్గా.. తాజాగా నిందితులందరినీ దోషులుగా తేల్చుతూ దిల్లీ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని