బీసీజీ వ్యాక్సిన్‌తో వైరస్‌ సంక్రమణకు అడ్డుకట్ట

బాసిల్లస్ కాల్మెట్ గురిన్ (బీసీజీ) వాక్సిన్‌ కరోనా సంక్రమణను, మరణాల రేటును తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బీసీజీ టీకా వేసిన..

Published : 02 Aug 2020 16:48 IST

వెల్లడించిన ఓ అధ్యయనం

దిల్లీ: బాసిల్లస్ కాల్మెట్ గురిన్ (బీసీజీ) వాక్సిన్‌ కరోనా సంక్రమణ, మరణాల రేటును తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బీసీజీ టీకా వేసిన మొదటి 30 రోజుల్లో దాని ప్రభావం అధికంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ పత్రికలో ప్రచురించిన ఈ అధ్యయనం పలు విషయాలు వెల్లడిస్తోంది. కరోనాతో అమెరికా సతమతమవుతోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన దేశంగా నిలిచింది. అయితే దశాబ్దాల క్రితమే ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేసి ఉంటే అగ్రరాజ్యంలో ఇన్ని కొవిడ్‌ మరణాలు సంభవించేవి కాదని అధ్యయనం పేర్కొంది. 

క్షయవ్యాధిని నివారించేందుకు పుట్టిన బిడ్డకు బీసీజీ టీకా ఇస్తారు. అంటువ్యాధుల నుంచి రక్షించుకునేందుకు బీసీబీ రోగనిరోధక శక్తిని పెంచుతుందని, కొవిడ్ -19పై ఈ టీకా ప్రభావమంతంగా పనిచేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. 135 దేశాల్లో ప్రతి రోజు కరోనా కేసుల పెరుగుదల ఎలా ఉంది, 134 దేశాల్లో మొదటి 30 రోజుల్లో మరణాలు ఎంత శాతంగా ఉన్నాయన్న విషయాన్ని నిపుణులు విశ్లేషించారు.ఈ టీకాను తప్పనిసరి చేస్తే సంక్రమణను తగ్గించే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వ్యాక్సిన్‌ అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పలేమని, ఇందుకు మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు. 

కరోనా మహమ్మారిని వివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా వ్యాక్సిన్ల తయారీకి క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అవి వివిధ దశల్లో ఉన్నాయి. భారత్‌లో 16 టీకాల ప్రయోగాలు పలు దశల్లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ శనివారం వెల్లడించారు. బీసీజీ వ్యాక్సిన్‌ మూడో దశ పరీక్షల్లో ఉందని ఆయన తెలిపారు. జైడుస్‌, క్యాడిలా డీఎన్‌ఏ మొదటి, రెండో దశలో ఉన్నాయని అన్నారు. 4 టీకాలు క్లినికల్‌ పరీక్షలు ముగించుకొని చివరి దశలో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని