Kota Suicides: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. తండ్రి వచ్చి వెళ్లిన కొద్ది గంటలకే..!

Kota Suicides: కోటాలో మరో ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో అక్కడ కనిపిస్తోన్న  బలవన్మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 

Published : 11 Aug 2023 16:20 IST

కోటా: రాజస్థాన్‌(Rajasthan)లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు (Kota Suicides) కలవరపెడుతున్నాయి. తాజాగా ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతోన్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రిని కలిసిన కొద్దిసేపటికే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలో ఇది మూడో ఘటన. 

ఉత్తర్‌ప్రదేశ్‌( Uttar Pradesh)లోని ఆజంగఢ్‌కు చెందిన మనీశ్‌ ప్రజాపతి.. ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షకు సిద్ధమవుతున్నాడు. దానికోసం నాలుగు నెలల క్రితం కోటాలోని శిక్షణాకేంద్రంలో చేరాడు. చదువుపరంగా అతడు కాస్త వెనకబడి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే గురువారం మనీశ్‌ను కలిసేందుకు అతడి తండ్రి వచ్చాడు. తర్వాత గురువారం సాయంత్రం మనీశ్‌ను హాస్టల్ వద్ద వదిలిపెట్టి అతడు ఉత్తర్‌ప్రదేశ్‌కు బయల్దేరివెళ్లాడు. 

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌

మార్గంమధ్యలో ఉండగా రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఓసారి కుమారుడితో మాట్లాడేందుకు ఫోన్‌ చేయగా ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో హాస్టల్ వార్డెన్‌కు ఫోన్‌ చేసి కుమారుడి గురించి ఆరాతీశాడు. వార్డెన్‌ వెంటనే హాస్టల్‌ గది వద్దకు వెళ్లగా మనీశ్‌ ఎంతకూ తలుపు తీయలేదు. దాంతో కిటికీలో నుంచి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. బెడ్‌షీట్‌తో ఉరివేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కొద్దిగంటల క్రితమే కలిసిన కుమారుడి మరణవార్త విన్న ఆ తండ్రి షాక్‌కు గురయ్యాడు. మనీశ్‌ది ఆత్మహత్యగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

వివిధ ఎంట్రెన్స్‌ టెస్టులు, పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన ‘కోటా’(Kota)లో.. పొరుగు రాష్ట్రాల ఎంతో మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి శిక్షణ పొందుతారు. ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే అక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 19కి చేరడం గమనార్హం. అంతకుముందు కూడా పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. వీటితోపాటు అనేక ఘటనల్లో విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, ఒత్తిడితోనే ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని