ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన మహిళ...వీడియో వైరల్‌!

హరియాణాలోని కైతాల్ జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది.వరదలతో ప్రజలు కష్టాలు పడుతుంటే ఏ ఒక్క ప్రజా ప్రతినిధి తమను పట్టించుకోవడానికి రాలేదని ఆగ్రహంతో ఓ మహిళ ఎమ్మెల్యే చెంపను చెళ్లుమనిపించింది. 

Updated : 13 Jul 2023 18:52 IST

చండీగఢ్‌: హరియాణాలోని కైతాల్ జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌ను ఓ మహిళ చెంప పగిలేలా కొట్టింది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఏం జరిగిందంటే... ఇటీవల కాలంలో హరియాణాలో భారీ వర్షాలు కురిసాయి. చాలా మంది నివాసితులు రోడ్డున పడ్డారు.  ఆహారం లభించక లక్షలాదిమంది అవస్థలు పడుతున్నారు. ఈ సమయంలో  నియోజకవర్గ ఎమ్మెల్యే బుధవారం బాధితులను పరామర్శించడానికి ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే రాగానే ఆ ప్రాంతంలోని జనం గుమిగూడి, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇన్ని రోజుల నుంచి నానా అవస్థలు పడుతుంటే ఇప్పుడా వచ్చేది అని నిలదీశారు.  వరదలతో ప్రజలు కష్టాలు పడుతుంటే ఏ ఒక్క ప్రజా ప్రతినిధి తమను పట్టించుకోవడానికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో ఉన్న ఓ మహిళ తీవ్ర ఆగ్రహంతో ఎమ్మెల్యే చెంపను చెళ్లుమనిపించింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడున్న ఎమ్మెల్యే భద్రతాధికారులు ఆ మహిళ నుంచి ఎమ్మెల్యేను రక్షించారు. అనంతరం ఎమ్మెల్యే సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను మహిళను క్షమించానని, ఆమెపై ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవన్నారు. మరోవైపు, రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు,  వరదల కారణంగా దాదాపు 10 మంది మరణించారు. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. వర్షాలు ఇంకా పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ బుధవారం తెలిపారు.  వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని