Agnipath: ఎయిర్‌ఫోర్స్‌లో జూన్‌ 24 నుంచి ‘అగ్నిపథ్‌’ నియామకాలు..!

సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నప్పటికీ.. కేంద్రం మాత్రం అగ్నివీరుల నియామకాల చర్యలు వేగవంతం చేసింది. అగ్నిపథ్‌ పథకం కింద

Published : 17 Jun 2022 15:48 IST

వెల్లడించిన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి

దిల్లీ: సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నప్పటికీ.. కేంద్రం మాత్రం అగ్నివీరుల నియామకాల చర్యలు వేగవంతం చేసింది. అగ్నిపథ్‌ పథకం కింద నియామక ప్రక్రియను త్వరలోనే విడుదల చేస్తామని ఇప్పటికే ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే వెల్లడించారు. తాజాగా వాయు సేనాధిపతి ఎయిర్‌ చీఫ్ మార్షల్‌ వీఆర్‌ చౌధరి కూడా దీనిపై స్పందించారు. జూన్‌ 24 నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీరుల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

‘‘యువత సాయుధ బలగాల్లో చేరేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకాన్ని ప్రకటించింది. 17.5 ఏళ్ల నుంచి 21ఏళ్ల మధ్య వయస్కులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా సైనిక నియామకాలు చేపట్టనందున.. అగ్నిపథ్‌ తొలి రిక్రూట్‌మెంట్‌కు గరిష్ఠ వయో పరిమితిని 23ఏళ్లకు పెంచడం అభినందనీయం. ఇది యువతకు ప్రయోజనకరంగా ఉంటుంది. జూన్‌ 24 నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నిపథ్‌ కింద నియామక ప్రక్రియను ప్రారంభించనున్నాం’’ అని ఓ వీడియో ప్రసంగంలో చౌధరి తెలిపారు.

అంతేగాక, వాయుసేనాధిపతి నేడు ఆరు ఫార్వర్డ్‌ బేస్‌లను సందర్శించి.. ఈ అగ్నిపథ్‌ పథకం గురించి వాయుసేన బలగాలకు వివరించనున్నారు. అటు ఆర్మీలోనూ అగ్నిపథ్‌ నియామకాలు త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో దీనిపై నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కాగా.. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసన జ్వాలలు చెలరేగాయి. నాలుగేళ్ల తర్వాత తమను నిరుద్యోగులుగా మార్చే ఈ పథకం తమకు వద్దని, పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ యువత ఆందోళనకు దిగింది. కొన్ని చోట్ల ఈ నిరసనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఈ క్రమంలోనే అగ్నిపథ్‌ నియామకాలపై ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీ ప్రకటనలు చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని