Anand Mahindra: వర్షం పడే వేళ సినిమా సాంగ్‌ రీమేక్‌.. వృద్ధ జంటపై మహీంద్రా ప్రశంస

సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) తాజాగా మరో వీడియోను షేర్‌ చేశారు. అలనాడు చిత్రించిన బాలీవుడ్‌ చిత్రంలోని ఒక వర్షం పాటను రీక్రియేట్‌ చేసిన వృద్ధ జంటను అభినందించారు. 

Updated : 03 Jul 2023 14:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) సోషల్‌ మీడియాలో తన ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకుంటారు. ట్విటర్‌ వేదికగా ఆయన షేర్‌ చేసిన మరో మోటివేషనల్‌ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

1979లో అమితాబ్‌ బచ్చన్‌, మౌషుమి ఛటర్జీ నటించిన ‘మంజిల్‌’ (Manzil) బాలీవుడ్‌ సినిమా (Bollywood Movie)లోని ‘రిమ్‌జిమ్‌ గిరే సావన్‌’ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ పాటలో ఇద్దరూ కలిసి వర్షంలో ముంబయి అంతా తిరుగుతూ కనిపిస్తారు. అచ్చం అలాగే ఒక వృద్ధ జంట పాటలో ఉన్నట్లుగా దుస్తులు ధరించి అవే లోకేషన్లలో ఒకరి చేతిని ఒకరు పట్టుకుని వర్షంలో తిరుగుతూ కనిపించారు. ఈ వీడియోపై ఆనంద్‌ మహీంద్రా స్పందించారు.

‘‘ఈ పాటలో కనిపిస్తున్న ఒక వృద్ధ జంట ప్రముఖ పాటను గుర్తు చేశారు. సినిమాలోని అవే లోకేషన్లలో తిరుగుతూ అచ్చం అలాగే కనిపించారు. వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మీ ఆలోచనలను బయటపెడితే.. మీరు కోరుకున్న జీవితాన్ని అందంగా మలుచుకోవచ్చు అని వారు ఈ వీడియో ద్వారా చెబుతున్నారు’’అని ప్రశంసించారు.

ఇప్పటి వరకు ఈ వీడియోను ఏడు లక్షల మందికి పైగా వీక్షించారు. దీనిపై స్పందిస్తూ నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. ఈ వీడియో ఎంతో మందిని కదిలిస్తుంది. ఈ జంట ఇలాంటి రోజులను ఇంకెన్నో గడపాలని కోరుకుంటున్నాను’అని ఒకరు కామెంట్‌ చేశారు. ‘ఈ పాటను రీమేక్‌ చేసినందుకు మీకు ధన్యవాదాలు. కలకాలం మీరు ఇలానే కలిసుండాలి’ అని మరొకరు పోస్టు చేశారు. ‘వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. సంతోషంగా గడపడానికి ఇది అడ్డు కాదు. మీ మధ్య ఎంత ప్రేమ ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది’ అని ఒకరు, ‘మీ ఆలోచన చాలా అందంగా ఉంది’ అని మరొకరు కామెంట్‌ చేశారు. ‘వారు మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజును ఆనందించగలుతున్నారు’ అని ఇంకొకరు రాసుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని