Anand Mahindra: నీరే నిజమైన సంపద.. బెంగళూరు నీటి కొరతపై మహీంద్రా ఆసక్తికర పోస్ట్‌

Anand Mahindra: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ తన అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా తాజాగా మరో వీడియో పంచుకున్నారు. 

Updated : 17 Mar 2024 18:46 IST

Anand Mahindra | ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరు (Bengaluru)లో నీటి సంక్షోభం కొనసాగుతోంది. వేసవి పూర్తిస్థాయిలో రాక ముందు నుంచే అక్కడి ప్రజలు నీటి కొరత (Water Scarcity)తో ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) పంచుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. 

ఎయిర్‌ కండిషన్‌ (AC) నుంచి బయటకు వచ్చే నీటిని వృథా చేయకుండా ఎలా నిల్వ చేసుకోవాలో సదరు వీడియోలో ఓ వ్యక్తి పంచుకున్నారు. ఏసీ కండెన్సర్‌కి ఓ సన్నని పైపును కనెక్ట్‌ చేసి ఆ నీటిని ఓ పెద్ద పైపులోకి పంపుతారు. దాని చివర ట్యాప్‌ అటాచ్‌ చేస్తారు. ఇలా ఏసీ నుంచి వృథాగా వచ్చే నీరు పెద్దపైపులో స్టోర్‌ అవుతుంది. ఈ నీటిని ఇళ్లు, కారు శుభ్రపరచుకోవడానికి, మొక్కల కోసం ఉపయోగించుకోవచ్చు. ఓవర్‌ ఫ్లో అయితే నీరు సులభంగా బయటకు వచ్చేందుకు పైపు పై భాగంలో ఓ రంధ్రాన్ని కూడా ఉంచారు. ఈ పద్ధతితో దాదాపు 100 లీటర్లకు పైగా నీటిని నిల్వ చేయొచ్చట. దీనికి సంబంధించిన వీడియోను మహీంద్రా ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. 

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు.. ఈసీ వెబ్‌సైట్‌లో కొత్త డేటా

‘‘దేశంలో ఏసీలు ఉపయోగించే ప్రతి చోటా ఇలాంటి పరికరాలు ఉండాలి. నీరే నిజమైన సంపద. వాటిని సురక్షితంగా నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని అందరికీ తెలపండి’’ అని వ్యాఖ్యలు జోడించారు. మహీంద్రా పంచుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. ‘‘ఏసీ నుంచి వచ్చే నీరు త్రాగడానికి సురక్షితం కాదు, కానీ వాటిని ఇంటి పనులకు ఉపయోగించుకోవచ్చు. సృజనాత్మకతకు ఎటువంటి కొరత లేదు’’ అని ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు. ‘‘ఇలాంటి వీడియోను పంచుకున్నందుకు ధన్యవాదాలు’’ అంటూ మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని