
Anil Deshmukh: రూ.2కోట్లు ఇవ్వు.. శరద్ పవార్‌ను నేను ఒప్పిస్తా..!
అనిల్ దేశ్‌ముఖ్ గురించి కీలక విషయాలు చెప్పిన సచిన్ వాజే
ముంబయి: ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం, దాని యజమాని మన్‌సుఖ్ హిరేన్ హత్య కేసులో అరెస్టయి కస్టడీలో ఉన్న పోలీస్ అధికారి సచిన్ వాజే.. ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసు శాఖలోకి తనను తిరిగి తీసుకోవడం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఇష్టం లేదని, అయితే రూ.2కోట్లు ఇస్తే పవార్‌ను ఒప్పిస్తానని అప్పటి హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. అంతేగాక, పోలీసుల బదిలీల్లో రూ.40కోట్ల లంచాలు వచ్చినట్లు చెప్పారు.
బార్లు, రెస్టారంట్ల నుంచి నెలకు రూ.100కోట్లు వసూలు చేయాలని మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పోలీసులను ఆదేశించారంటూ ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఇటీవల ప్రత్యేక కోర్టుకు ఛార్జ్‌షీట్ సమర్పించింది. దర్యాప్తులో భాగంగా కస్టడీలో ఉన్న సచిన్ వాజేను విచారించగా.. ఆయన కీలక విషయాలు చెప్పినట్లు ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
రూ.2కోట్లు ఇమ్మన్నారు..
2004లో ఓ కస్డోడియల్ మరణానికి సంబంధించిన కేసులో వాజే సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత 2020లో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయితే ఈ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేసిన శరద్ పవార్.. వాజేను మళ్లీ సస్పెండ్ చేయమన్నారు. ఆ సమయంలో హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్.. వాజేకు ఫోన్ చేసి.. ‘‘నువ్వు రూ.2 కోట్లిస్తే శరద్ పవార్‌ను ఒప్పిస్తా’’ అని చెప్పారట. అయితే అంత మొత్తం తాను చెల్లించలేనని చెప్పడంతో తర్వాత ఇవ్వమని అన్నట్లు వాజే చెప్పారని ఈడీ వెల్లడించింది.
ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో అనిల్ దేశ్‌ముఖ్ తనను పిలిపించుకని.. ముంబయిలోని 1650 బార్ల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయమని చెప్పారని వాజే తెలిపారు. ఒక్కో బార్ నుంచి 3 నుంచి 3.5 కోట్లు రాబట్టాలని అన్నారు. అది తన పరిధిలో లేదని చెప్పడంతో తనను ఉద్యోగంలో ఉంచినందుకు డిమాండ్ చేసిన రూ.2 కోట్లు గురించి దేశ్‌ముఖ్ ప్రస్తావించారని వాజే అన్నట్లు ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
బదిలీల్లో భారీ మొత్తం..
2020 జులైలో 10 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ అప్పటి ముంబయి కమిషనర్ పరమ్‌బీర్ సిగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులపై అనిల్ దేశ్‌ముఖ్, మరో మంత్రి అనిల్ పరబ్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో వాటిని వెనక్కి తీసుకున్నారు. ‘‘3-4 రోజుల తర్వాత కొన్ని సర్దుబాట్లు, డబ్బు గురించి చర్చలు జరిగిన తర్వాత బదిలీ ఉత్తర్వులను మళ్లీ కొత్తగా జారీ చేసినట్లు తెలిసింది. ఈ బదిలీల ప్రక్రియలో రూ.40కోట్లు వసూలైనట్లు తెలిసింది. ఇందులో రూ.20కోట్లు అనిల్ దేశ్‌ముఖ్, మరో రూ.20కోట్లు అనిల్ పరబ్‌కు అందాయి’’ అని వాజే చెప్పినట్లు ఈడీ ఛార్జ్‌షీట్‌లో వెల్లడించింది.
Advertisement