Barbie: బార్బీ బొమ్మలుగా కరోనా ఫ్రంట్‌లైన్‌ మహిళా వారియర్లు!

కరోనా సమయంలో వైద్య సిబ్బంది వారి ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించారు. అందుకే వారి సేవలను ప్రపంచమంతా కొనియాడుతోంది. తాజాగా బార్బీ బొమ్మలను తయారు చేసే మాట్టెల్‌ సంస్థ కూడా ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా నిలిచిన మహిళా వైద్య సిబ్బంది గౌరవార్థం ‘రోల్‌ మోడల్‌ డాల్స్‌’ పేరుతో బార్బీ బొమ్మల

Updated : 06 Aug 2021 12:45 IST


(Photo: barbie twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సమయంలో వైద్య సిబ్బంది వారి ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించారు. అందుకే వారి సేవలను ప్రపంచమంతా కొనియాడుతోంది. తాజాగా బార్బీ బొమ్మలను తయారు చేసే మాట్టెల్‌ సంస్థ కూడా ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా నిలిచిన మహిళా వైద్య సిబ్బంది గౌరవార్థం ‘రోల్‌ మోడల్‌ డాల్స్‌’ పేరుతో బార్బీ బొమ్మల కొత్త ఎడిషన్‌ను విడుదల చేసింది. కొవిడ్‌పై పోరులో తమ వంతు సేవలు అందించిన ఆరుగురు మహిళా వైద్య సిబ్బందిని గుర్తించి వారి రూపురేఖలతో బార్బీ బొమ్మలను తయారు చేసింది. వారిలో కరోనా వ్యాక్సిన్‌ ఆస్ట్రా-జెనికాను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త సారా గిల్‌బర్ట్‌ కూడా ఉన్నారు. 

మాట్టెల్‌ సంస్థ తనలాంటి బార్బీ బొమ్మను తయారు చేయడం పట్ల గిల్‌బర్ట్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘నాలా కనిపించే బార్బీ బొమ్మను తయారు చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ, అమ్మాయిలు సైన్స్‌ను తమ కెరీర్‌గా ఎంచుకోవడానికి ఈ బార్బీ బొమ్మలు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆశిస్తున్నా’’అని తెలిపారు. గిల్‌బర్ట్‌తోపాటు మరో ఐదుగురు వైద్య సిబ్బందికి ఈ అరుదైన గౌరవం దక్కింది.

అమెరికాలోని బ్రూక్లిన్‌లో తొలి కరోనా బాధితుడికి చికిత్స అందించిన నర్సు అమీ ఓ సులివన్‌, లాస్‌వెగాస్‌కు చెందిన వైద్యురాలు ఆండ్రే క్రూజ్‌, కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టోరొంటోలో సైక్రియాటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ చికా స్టాకీ ఒరియువా, బ్రెజిల్‌కు చెందిన బయోమెడికల్‌ రీసెర్చర్‌ జాక్వెలిన్‌ గోస్‌ డి జీసస్‌, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ కోసం సర్జికల్‌ గౌను రూపొందించిన ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్‌ కిర్బీ వైట్‌ బార్బీ రోల్‌ మోడల్‌ డాల్స్‌గా మారారు.

అంతకుముందు టోక్యో ఒలింపిక్స్‌లో మహిళా అథ్లెట్లు విశేషంగా రాణించాలని, పతకాలు సాధించాలని కాంక్షిస్తూ అథ్లెట్ల బార్బీ బొమ్మలను రూపొందించింది. స్పోర్ట్స్‌ దుస్తుల్లో, మెడలో పతకాలతో ఉన్న బార్బీ బొమ్మలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని