Indian Army: పాక్‌ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన భారత బలగాలు

జమ్ముకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ జవాన్లు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.గడిచిన ఏడాదికాలంలో కశ్మీర్‌లో ఇంత పెద్దమొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి.

Published : 24 Dec 2022 19:57 IST

శ్రీనగర్: భారత్‌లో (India) మారణహోమం సృష్టించేందుకు పాకిస్థాన్‌ (Pakistan) పన్నిన కుట్రను భారత బలగాలు భగ్నం చేశాయి. జమ్ముకశ్మీర్‌ (Jammu kashmir) లోని యూరి సెక్టార్‌ (Uri Sector) సరిహద్దు ద్వారా భారత్‌లోకి ఆయుధాలు (Wepons), మందుగుండు సామగ్రిని అక్రమంగా తరలించి పేలుళ్లకు పాల్పడేందుకు చేసిన భారీ యత్నాన్ని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో 8 ఏకే రైఫిల్స్‌తోపాటు 12 గన్‌లు, పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గడిచిన ఏడాదికాలంలో కశ్మీర్‌లో ఇంత పెద్దమొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి.

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (Lashkar e Taiba) తో సంబంధమున్న కొందరు వ్యక్తులు పెద్ద మొత్తంలో భారత్‌లోకి ఆయుధాలను చేరవేస్తున్నారన్న పక్కా సమాచారంతో స్థానిక పోలీసులు, ఆర్మీ జవాన్లు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. జమ్ముకశ్మీర్‌లోని హత్‌లంగా గ్రామ సమీపంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే, దీనికి కారణమైన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఏకే 74 రైఫిల్‌ లాంటి ఆయుధాలను ఉగ్రవాదుల చేతికిచ్చి భారత్‌లోకి ప్రవేశించేందుకు పాక్‌ దళాలు సహకారం అందిస్తున్నాయని భారత్‌ ఆరోపించింది. తద్వారా కశ్మీర్‌ లోయలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని