Gujarat Trajedy: తీగల వంతెన కూలిన ఘటన.. రేపు మోర్బీకి ప్రధాని..!

గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై ఉన్న తీగల వంతెన కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 134కు చేరింది. ఘటనాస్థలాన్ని ప్రధాని మోదీ నేడు పరిశీలించనున్నారు.

Published : 31 Oct 2022 15:44 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లో తీగల వంతెన కూలిన ప్రాంతాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిశీలించనున్నారు. ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం మోర్బీ వెళ్లి ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నట్లు గుజరాత్‌ ముఖ్యమంత్రి కార్యాలయం నేడు వెల్లడించింది.

ప్రస్తుతం మోదీ గుజరాత్‌ పర్యటనలోనే ఉన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని కేవడియాలోని ఐక్యతా విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయగా.. మోర్బీ ప్రమాదం నేపథ్యంలో వాటిని రద్దు చేశారు. ఈ ఉదయం కేవడియాలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడ ఉన్నా.. నా మనసంతా మోర్బీ బాధితుల గురించే ఆలోచిస్తోంది. ఇంతటి బాధను అనుభవించిన సందర్భాలు చాలా తక్కువ. ఓ వైపు గుండెల్నిండా భరించలేని బాధ ఉన్నా.. తప్పక విధులు నిర్వహించాల్సి వస్తోంది’’ అని ఉద్వేగానికి గురయ్యారు.

మోర్బీలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్‌ కాలం నాటి తీగల వంతెన ఆదివారం కుప్పకూలి పెను ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 134 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది గల్లంతయ్యారు. వారి కోసం ఘటనాస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు త్రివిధ దళాలు కూడా ఈ సహాయకచర్యల్లో పాల్గొన్నాయి. ఇప్పటికే గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ మోర్బీకి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని