Border Dispute: వాటిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించండి : ఉద్ధవ్‌ ఠాక్రే

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో (Belagavi Border Dispute) వివాదాస్పద ప్రదేశాలను కేంద్ర పాలిత ప్రాంతంగా (Union Territory) ప్రకటించాలని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) డిమాండ్‌ చేశారు.

Published : 26 Dec 2022 15:37 IST

నాగ్‌పుర్‌: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం (Belagavi Border Dispute) కొనసాగుతూనే ఉంది. విపక్షాలతోపాటు రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపా నేతలూ ఎవరికి వారే ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దులో వివాదాస్పదంగా మారిన ప్రదేశాలను కేంద్ర పాలిత ప్రాంతం (Union Territory)గా ప్రకటించాలని శివసేన (యూబీటీ) నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) డిమాండ్‌ చేశారు. అక్కడి శాసన మండలిలో మాట్లాడిన ఆయన.. ఇది కేవలం భాష, సరిహద్దు వివాదం మాత్రమే కాదని, మానవత్వానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.

సరిహద్దు ప్రాంతంలో మరాఠీ మాట్లాడే వారు ఎన్నో తరాలుగా నివసిస్తున్నారని.. వారి భాష, జీవన విధానం మరాఠీనేనని ఉద్ధవ్‌ ఠాక్రే వివరించారు. ఈ అంశం సుప్రీం కోర్టులో ఉన్నందున.. కర్ణాటక ఆక్రమిత మహారాష్ట్రను కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్నారు. ఈ విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా చేయలేదని ప్రశ్నించిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.

శీతాకాల సమావేశాల్లో భాగంగా మహారాష్ట్ర ఉభయ సభల్లో సరిహద్దు వివాదంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ దీనిపై తీర్మానం చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీర్మానం చేయలేకపోతోందని విపక్ష నేత అజిత్‌ పవార్‌ ప్రశ్నించారు. కర్ణాటక ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయన్నారు.

అంగుళం భూమినీ వదులుకోం

సరిహద్దు వివాదంపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌.. అంగుళం భూమి కోసమైనా రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ఫడణవీస్‌.. కర్ణాటకలో ఉన్న మరాఠీ మాట్లాడే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే దిల్లీ పర్యటనలో ఉన్నందున తీర్మానాన్ని ప్రవేశపెట్టలేకపోయామని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఫడణవీస్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని