Mallikarjun Kharge: వాజ్‌పేయీ మాటలు ఇంకా రికార్డుల్లోనే..’: ప్రసంగ పదాల తొలగింపుపై ఖర్గే

అదానీ గ్రూప్‌(Adani Group) వ్యవహారంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే చేసిన ప్రసంగంలోని కొన్ని పదాలను తొలగించారు. 

Published : 09 Feb 2023 13:28 IST

దిల్లీ: అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ అదానీ గ్రూప్‌ (Adani Group)పై ఇచ్చిన నివేదిక రాజకీయ దుమారం రేపుతూనే ఉంది. దీనిపై ప్రధాని మోదీ(Modi)ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ (Congress) అగ్రనేతలు పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించారు. ఇప్పటికే రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శల్లోని కొన్ని పదాలను తొలగించగా.. తాజాగా మల్లికార్జున ఖర్గే ప్రసంగం విషయంలోనూ అదే పరిస్థితి ఎదురైంది. దీనిపై ఆయన రాజ్యసభ ఛైర్మన్‌ను ప్రశ్నించారు.

‘నా ప్రసంగంలో ఎవరిపట్లా అమర్యాదకరమైన, నిందారోపణలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. అందులోని కొన్ని పదాలను వక్రీకరించారు. మీకు అనుమానం ఉంటే.. దాన్ని ఇంకో రూపంలో ప్రస్తావించి ఉండాల్సింది. కానీ మీరు ప్రసంగంలోని కొన్ని పదాలు తొలగించాలని చెప్పారు. గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ.. మరో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు వ్యతిరేకంగా వాడిన పదం ఇంకా రికార్డుల్లో ఉంది’ అని ఖర్గే గుర్తుచేశారు. అలాగే నిన్నటి ప్రధాని ప్రసంగంపై ఖర్గే మీడియాతో మాట్లాడారు. ‘అదానీ అంశంపై మేం అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇవ్వలేదు. ఆయన ఎప్పుడూ వాస్తవ సమస్యను దారిమళ్లిస్తూ మాట్లాడతారు’ అని విమర్శలు చేశారు.  

ఈ బడ్జెట్ సమావేశాల్లో అదానీ వ్యవహారంపై రగడ నడుస్తోంది. బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా ఉభయ సభల్లోనూ అధికార-విపక్షాలు పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నాయి. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణల మీద సంయుక్త విచారణ సంఘాన్ని నియమించాలని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. దాంతో పాటు గుజరాత్‌ అల్లర్ల విషయంలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ చేసిన వ్యాఖ్యల్నీ ఖర్గే ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని