Sukesh- Jacqueline: నిజాలన్నీ బయటపెడతా: జాక్వెలిన్‌ను బెదిరిస్తూ సుకేశ్‌ లేఖ..!

Sukesh- Jacqueline: జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌.. బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ను బెదిరిస్తూ ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ నటి గురించి నిజాలన్నీ బయటపెడతానని అతడు అందులో హెచ్చరించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?  

Published : 22 Dec 2023 17:22 IST

దిల్లీ: ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌ (Sukesh Chandrashekhar) నిందితుడిగా ఉన్న రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌  (Jacqueline Fernandez) ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఆమె విచారణకు కూడా హాజరైంది. అయితే, జైల్లో ఉన్న సుకేశ్.. ఆ మధ్య నటికి పలుమార్లు ప్రేమ సందేశాలు పంపాడు. దీంతో జాక్వెలిన్‌ తాజాగా కోర్టును ఆశ్రయించింది.

సుకేశ్ తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ దిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అంతేగాక, సుకేశ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడు తనను ట్రాప్‌ చేశాడని నటి తన పిటిషన్‌లో పేర్కొంది. తనపై కేసును కొట్టివేయాలని అభ్యర్థించింది. జాక్వెలిన్‌ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలంటూ ఈడీని కోర్టు ఆదేశించింది. అయితే, నటి పిటిషన్‌ గురించి తెలుసుకున్న సుకేశ్.. ఆమెపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజాగా ఓ లేఖ రాశాడు. అందులో అతడు జాక్వెలిన్‌ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. అది ఆమెనుద్దేశించే రాసినట్లు సుకేశ్ తరఫు న్యాయవాది మీడియాకు తెలిపారు.

కొండల్లో నక్కి.. ‘బ్లైండ్‌ స్పాట్‌’ వద్ద టార్గెట్ చేసి..!

ఇక, ఆ లేఖలో సుకేశ్‌.. జాక్వెలిన్‌ను బెదిరించినట్లు తెలుస్తోంది. ‘‘నేను చాలా దిగ్భ్రాంతికి గురయ్యా. ఎవరినైతే (జాక్వెలిన్‌ను ఉద్దేశిస్తూ) భద్రంగా చూసుకోవాలనుకున్నానో.. వారే ఇప్పుడు ఎదురుతిరిగారు. వెన్నుపోటు పొడిచారు. బాధితులుగా పేర్కొంటూ నిందలు వేయడం మొదలుపెట్టారు. నన్ను చెడ్డవాడిగా చూపించాలనుకుంటున్నారు. ఇది నేను కలలో కూడా ఊహించలేదు. హృదయం ఉన్నది ముక్కలవ్వడం కోసమే అని ఇప్పుడు అర్థమైంది. ఇక నాకు వాస్తవాలను బయటపెట్టడం తప్ప మరో అవకాశం లేదు’’ అంటూ సుకేశ్‌ తన లేఖలో పేర్కొన్నట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.

‘‘ఆ వ్యక్తిని (జాక్వెలిన్‌) రక్షించేందుకు ఇన్నాళ్లూ రహస్యంగా దాచి ఉంచి ఆధారాలన్నీ బయటపెడతా. చాట్స్‌, స్క్రీన్‌షాట్స్‌, రికార్డింగ్స్‌, విదేశీ ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు.. అన్నింటి గురించి చెబుతా. ఆ వ్యక్తిని సోషల్‌ మీడియాలో ప్రమోట్‌ చేసేందుకు మిలియన్‌ డాలర్ల చెల్లింపులు చేశా. అందుకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లను బయటపెడతా. ఈ వాస్తవాలను ప్రపంచం తెలుసుకోవాలి’’ అని సుకేశ్ అందులో బెదిరించినట్లు తెలుస్తోంది.

సుకేశ్ (Sukesh Chandrashekar) నుంచి జాక్వెలిన్‌ (Jacqueline Fernandez) ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పేర్కొంది. ఈ కేసులో ఆమెను పలుమార్లు విచారించింది కూడా. అయితే సుకేశ్ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని జాక్వెలిన్‌ ఆ మధ్య వాపోయింది. అతడు తన జీవితంతో ఆడుకొని కెరీర్‌ను, జీవనోపాధిని నాశనం చేశాడని న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. హోంశాఖలో ఓ ముఖ్య అధికారిగా సుకేశ్‌ తనను తాను పరిచయం చేసుకున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని