Kejriwal: మద్యం కేసులో ఈడీ ఫిర్యాదు.. కేజ్రీవాల్‌కు కోర్టు మళ్లీ సమన్లు

Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన వ్యవహారంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 16న హాజరుకావాలని ఆదేశించింది.

Updated : 07 Mar 2024 11:47 IST

దిల్లీ: నగదు అక్రమ చలామణి కేసులో విచారించేందుకు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు పలుమార్లు సమన్లు జారీచేసినా ఆయన హాజరుకావడం లేదని ఈడీ మరోసారి న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. దిల్లీ సీఎంకు మళ్లీ సమన్లు జారీ చేసింది. మార్చి 16వ తేదీన తప్పనిసరిగా న్యాయస్థానంలో హాజరుకావాలని ఆదేశించింది.

మద్యం కుంభకోణం (Delhi excise policy case) కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌కు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఈడీ సమన్లు పంపిన విషయం తెలిసిందే. అయితే, వాటిని ఆయన తిరస్కరించారు. ఈ క్రమంలోనే మొదటి మూడుసార్లు సమన్లకు ఆయన స్పందించలేదని గత నెల కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పుడు విచారణ జరిపి ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని ఆదేశించింది. అయితే, ఆ సమయంలో అసెంబ్లీ విశ్వాస పరీక్ష ఉన్నందున వర్చువల్‌గా హాజరైన సీఎం.. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతాని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.

గంపగుత్త అధికారం పార్లమెంటుకు లేదు

ఈ అంశం కోర్టులో పెండింగ్‌ ఉండగానే ఈడీ ఆయనకు మరిన్ని సమన్లు జారీ చేసింది. చివరిసారిగా మార్చి 4న విచారణకు రావాలని పిలవగా.. కేజ్రీవాల్‌ గైర్హాజరయ్యారు. అయితే, విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఈడీకి సమాధానం పంపారు. మార్చి 12 తర్వాతే వర్చువల్‌గా హాజరవుతానని షరతు విధించారు. దీంతో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం తాజాగా ఆయనకు సమన్లు జారీ చేసింది.

మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ.. కేజ్రీవాల్‌ను విచారించింది. గతేడాది ఏప్రిల్‌లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పుడు ఈడీ నమోదు చేసిన కేసులోనూ ఆయనకు సమన్లు అందాయి. ఇక ఇదే కుంభకోణం ఆరోపణలపై దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ అరెస్టయి జైల్లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని