Denis Alipov: ‘స్నేహానికి మించింది ఏదీ లేదు’ : భారత్‌తో మైత్రిపై రష్యా రాయబారి వ్యాఖ్య

రష్యా, భారత్‌ మధ్య మైత్రికి 75 సంవత్సరాలు పూర్తయిన  వేళ.. దిల్లీలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ వేడుకలు తాజాగా తిరిగి మొదలయ్యాయి.

Updated : 22 Nov 2022 15:08 IST

దిల్లీ: భారత్‌, రష్యా మధ్య స్నేహం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ బంధానికి 75 ఏళ్లు. ఇందులో భాగంగా దిల్లీలో రెండు దేశాల సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మనదేశంలోని రష్యా రాయబారి డెనిస్‌ అలిపోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీలో ప్రాచుర్యంలో ఉన్న ఒక సామెతను ప్రస్తావిస్తూ.. రెండు దేశాల మధ్య స్నేహబంధం ఏ స్థాయిలో ఉందో వెల్లడించారు.

‘‘ఈ రోజు( సోమవారం రాత్రి) రెండు దేశాల సంస్కృతిని ప్రతిబింబించే పండగలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు ఇరుదేశాల మధ్య వైవిధ్యమైన సంబంధాలు, చారిత్రక బంధం, పరస్పర ప్రయోజనాలు, విశ్వాసానికి నిదర్శనం. ‘స్నేహాన్ని మించింది ఏదీ లేదు’ అని భారత్‌లో ప్రాచుర్యం పొందిన సామెత ఒకటి ఉంది. భారత్‌, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఉన్న విశ్వాసం, స్నేహపూర్వక సంబంధాలకు ఇది అతికినట్లు సరిపోతుంది’’ అని అలిపోవ్‌ వ్యాఖ్యానించారు.

కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ వేడుకలు తాజాగా పునఃప్రారంభమయ్యాయి. ‘దిల్లీలో మొదలైన ఈ సాంస్కృతిక కార్యక్రమం.. తర్వాత కోల్‌కతా, ముంబయిలో కూడా జరుగుతుంది. నవంబర్‌ 29కి తిరిగి దిల్లీకి చేరుకుంటుంది. ఈ క్రమంలో రష్యా సంస్కృతిని ఇక్కడి ప్రజలు ఆస్వాదిస్తారని అనుకుంటున్నా’ అని రష్యా రాయబారి అన్నారు. గత కొద్ది నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగిస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ పాశ్చాత్య దేశాలు ఐరాసలో ఖండన తీర్మానాలు ప్రవేశపెడుతున్నాయి. వీటిపై భారత్‌ తటస్థ వైఖరిని ప్రదర్శిస్తోంది. దౌత్య మార్గాల ద్వారా మాత్రమే వివాదాలు పరిష్కరించుకోవాలని, ఇది యుద్ధాల యుగం కాదని సూచించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని