Gurpatwant Singh Pannun: ఎయిరిండియా ప్రయాణీకులకు గురుపత్వంత్‌ హెచ్చరిక

ఎయిరిండియా విమానాల్లో నవంబర్‌ 19 ప్రయాణించే వారికి ప్రమాదం పొంచిఉందంటూ ఖలిస్థాన్‌ ఏర్పాటువాది పన్నూ చేసిన హెచ్చరికలు వైరల్‌ అవుతున్నాయి

Published : 04 Nov 2023 20:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నవంబర్‌ 19న ఎయిర్‌ ఇండియా (Air India) విమానంలో ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉందంటూ ఖలిస్థాన్ ఏర్పాటు వాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) చేసిన హెచ్చరికలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. భారత్‌లోని సిక్కు ప్రజలెవరూ ఆ రోజున ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దని పన్నూ ఓ వీడియోను విడుదల చేశాడు. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ రోజు మూతపడుతుందని, దాని పేరు కూడా మార్చేస్తామని వీడియోలో హెచ్చరించాడు. అదే రోజున వన్డే ప్రపంచ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కూడా జరగబోతున్న విషయాన్ని పన్నూ ప్రస్తావించాడు.

ఇజ్రాయెల్‌- పాలస్తీనా పరిస్థితులను చూసి ప్రధాని మోదీ నేర్చుకోవాలని, లేదంటే భారత్‌లోనూ అదే తరహా పరిణామాలు ఎదురవుతాయంటూ పన్నూ అక్టోబర్‌ 10న సామాజిక మాధ్యమాల్లో  వీడియోను పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ‘‘ పాలస్తీనాలోనే కాదు.. ఇక్కడ కూడా హింస మరో స్థాయిలో ఉంటుంది’’ అంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) అనే వేర్పాటువాద సంస్థను భారత్‌ 2019లోనే నిషేధించింది. 2007లో ఈ సంస్థను స్థాపించగా.. వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్‌ సింగ్ పన్ను కూడా ఒకడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని