
మయన్మార్ సైనిక ఖాతాను తొలగించిన ఫేస్బుక్!
నెపిడా: మయన్మార్లో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితులపై సామాజిక మాధ్యమం ఫేస్బుక్ తీవ్రంగా స్పందించింది. మాండలే నగరంలో శనివారం జరిగిన పౌర నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో.. ఆ దేశ మిలిటరీకి సంబంధించిన అధికారిక పేజీని ఫేస్బుక్ తొలగించింది. హింసాత్మక విధానాలతో తమ సంస్థ నిబంధనలను మిలిటరీ పదేపదే ఉల్లంఘిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ సంస్థ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు శనివారం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించగా.. మరో 40 మంది గాయాల పాలయ్యారు.
‘‘మా అంతర్జాతీయ విధానాలకు మేం కట్టుబడి ఉన్నాం. హింసను ప్రేరేపిస్తూ మా కమ్యూనిటీ ప్రమాణాలను పదేపదే ఉల్లంఘిస్తున్నందున.. ‘టాట్మడా ట్రూ న్యూస్ ఇన్ఫర్మేషన్ టీం’ అనే పేరుతో ఉన్న మిలిటరీ పేజీని ఫేస్బుక్ నుంచి తొలగిస్తున్నాం’’ అని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు ప్రకటనలో తెలిపారు. దీనిపై మిలిటరీ ప్రతినిధిలు స్పందించాల్సి ఉంది.
కాగా, మయన్మార్లో ఆన్లైన్ వేదికగా మిలిటరీ విద్వేష ప్రచారాల్ని నియంత్రించడంలో ఫేస్బుక్ విఫలమైందని గతంలో అంతర్జాతీయంగా ఆ సంస్థపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిలిటరీ విద్వేష ప్రచారాల్ని అడ్డుకునేందుకు గత కొద్ది సంవత్సరాలుగా ఫేస్బుక్ ఆ దేశంలోని పౌర హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి పనిచేస్తోంది. అంతేకాకుండా 2018లో ప్రస్తుత ఆర్మీ చీఫ్ అయిన మిన్ ఆంగ్ హ్లయింగ్తో పాటు వందలాది మిలిటరీ సభ్యుల ఖాతాల్ని కూడా తొలగించడం గమనార్హం.