Farmers protest: అన్నదాతల ఆందోళన ఉద్ధృతం.. టియర్‌ గ్యాస్‌ ప్రయోగం.. రైతు మృతి!

అన్నదాతలు తలపెట్టి ‘దిల్లీ చలో’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ క్రమంలో సుభకరన్‌ సింగ్‌ అనే ఓ యువ రైతు (21) ప్రాణాలు కోల్పోయారు.

Published : 21 Feb 2024 22:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్‌-హరియాణా సరిహద్దులో రైతులు చేస్తోన్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అన్నదాతలు తలపెట్టి ‘దిల్లీ చలో’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ క్రమంలో సుభకరన్‌ సింగ్‌ అనే ఓ యువ రైతు (21) ప్రాణాలు కోల్పోయారు. ఆయన్ను పంజాబ్‌లోని భటిండా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనలో మరికొంత మంది గాయాలపాలైనట్లు సమాచారం.

తమ డిమాండ్లపై బుధవారం ఉదయం 11 గంటలకల్లా ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో తాము తలపెట్టిన ‘దిల్లీ చలో’ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు డెడ్‌లైన్‌ విధించారు. మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమంటూ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చినప్పటికీ.. రైతులు తమ ఆందోళన కొనసాగించారు. శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన ముళ్లకంచెలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు మూడు రౌండ్లలో టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఇందుకోసం ఓ డ్రోన్‌ను కూడా వినియోగించారు. ఆ సమయంలో పలువురు రైతులు గాయాలపాలయ్యారు. పోలీసు చర్య వల్లే అన్నదాత మరణించినట్లు రైతు సంఘాలు ఆరోపించాయి. నిరసనకారులపై హరియాణా పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారని పేర్కొన్నాయి.

మరోవైపు కేంద్ర హోంశాఖ జారీ చేసిన అడ్వైజరీపై పంజాబ్‌(Punjab) ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సరిహద్దు ప్రాంతాల్లో నిరసనకారులు గుమిగూడేందుకు అనుమతిస్తున్నామనడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. హరియాణా పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్స్‌, రబ్బర్ బుల్లెట్లు, డ్రోన్ల వల్ల 160 మంది రైతులు గాయపడినప్పటికీ.. పంజాబ్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా శాంతిభద్రతలను పరిరక్షిస్తోందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని