IndiGo: కార్గిల్‌ హీరోకు ఇండిగో అపూర్వ గౌరవం.. వీడియో వైరల్‌

కార్గిల్‌ యుద్ధంలో ఎందో ధైర్యాన్ని ప్రదర్శించి శత్రుమూకలను హతమార్చిన వీరుడికి ఇండిగో (IndiGo) అపూర్వ స్వాగతం పలికింది. ఆయన గురించి విమానంలో ప్రత్యేక ప్రకటన చేశారు.

Updated : 24 Jul 2023 11:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాడిన యుద్ధ వీరుడి (Kargil War Hero)కి ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) అపూర్వ స్వాగతం పలికింది. ఆయన పోరాటానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చిరు కానుకతో సత్కరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ (Viral Video) అవుతోంది.

పరమ్‌ వీర్‌ చక్ర (Param Veer Chakra) అవార్డు గ్రహీత సుబేదార్‌ మేజర్‌ సంజయ్‌ కుమార్‌ (Subedar Major Sanjay Kumar) ఆదివారం పుణె వెళ్లే ఇండిగో (IndiGo) విమానంలో ప్రయాణించారు. దీంతో విమానం టేకాఫ్‌కు ముందు ఆయనను గౌరవిస్తూ కెప్టెన్‌ ప్రత్యేక అనౌన్స్‌మెంట్‌ చేశారు. ‘‘ఈ రోజు విమానంలో మనతో పాటు ప్రత్యేక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే పరమ్‌ వీర్‌ చక్ర అవార్డు గ్రహీత సుబేదార్‌ మేజర్‌ సంజయ్‌ కుమార్‌. యుద్ధ వీరుల ధైర్యసాహసాలకు ఇచ్చే అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డు ఇది. భారత చరిత్రలో ఇప్పటివరకు కేవలం 21 మంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు’’ అని కెప్టెన్‌ చెప్పడంతో తోటి ప్రయాణికులంతా చప్పట్లతో ఆయనను అభినందించారు.

ఆకాశంలో తొలి పుట్టినరోజు.. ఆ చిన్నారికి విమానం జీవితాంతం గుర్తుండిపోతుంది!

అనంతరం సుబేదార్‌ మేజర్‌ సంజయ్‌ కుమార్‌ దేశానికి అందించిన సేవలను కూడా కెప్టెన్‌ వివరించారు. ‘‘1999 జులై 4న జమ్మూకశ్మీర్‌ రైఫిల్స్‌ 13వ బెటాలియన్‌ సభ్యుడిగా ఉన్న సంజయ్‌ కుమార్‌ కార్గిల్‌ యుద్ధంలో తీవ్రంగా పోరాడారు. శత్రువుల దాడిలో ఆయన ఛాతీపై రెండు బులెట్లు దూసుకెళ్లాయి. ముంజేతిపైనా బులెట్‌ గాయమైంది. అయినా ఆయన వెనకడుగు వేయలేదు. శరీరం నుంచి రక్తం ధారలై కారుతున్నా.. శత్రువుల బంకర్‌లోకి వెళ్లి పాక్‌ సైనికులను హతమార్చారు’’ అని కెప్టెన్‌ ఆయన సేవలను కొనియాడారు. ప్రయాణికులంతా చప్పట్లతో ఆయనను గౌరవించగా.. ఇండిగో సిబ్బంది చిరు కానుకను అందించి ఆయనను సత్కరించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఇండిగో తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ‘‘హీరోతో కలిసి విమాన ప్రయాణం’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘సుబేదార్‌ మేజర్‌ సంజయ్‌ కుమార్‌ ధైర్య సాహసాలకు శతకోటి వందనాలు’ అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లో జన్మించిన సంజయ్‌ కుమార్‌ ఆర్మీలో చేరి విశేష సేవలందించారు. ఆయన ధైర్యసాహసాలకు ప్రతీకగా అత్యున్నత సైనిక పురస్కారాన్ని అందుకున్నారు. గతేడాది ఆయన్ను సుబేదార్‌ మేజర్‌ ర్యాంక్‌కు ప్రమోట్‌ చేశారు. ప్రస్తుతం పుణె సమీపంలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని