రఫేల్‌ యుద్ధవిమానాల సరఫరాలో జాప్యం లేదు!

ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ కొనుగోలు చేసిన రఫేల్‌ యుద్ధవిమానాల తరలింపులో ఎలాంటి ఆలస్యం ఉండబోదని ఫ్రాన్స్‌ మరోసారి స్పష్టంచేసింది. భారత్‌కు వీటిని సరఫరా చేయడానికి నిర్ధేశించిన సమయానికి ఫ్రాన్స్‌ కట్టుబడి ఉన్నట్లు ఫ్రెంచ్‌ రాయబారి ఎమాన్యుయెల్‌ లెనాయిన్‌ పేర్కొన్నారు.

Published : 26 May 2020 01:54 IST

సకాలంలోనే భారత్‌ చేరుతాయన్న ఫ్రాన్స్‌

దిల్లీ: భారత్‌ కొనుగోలు చేసిన రఫేల్‌ యుద్ధవిమానాల సరఫరాలో జాప్యం ఉండబోదని ఫ్రాన్స్‌  స్పష్టంచేసింది. భారత్‌కు వీటిని సరఫరా చేయడానికి నిర్ధేశించిన సమయానికి ఫ్రాన్స్‌ కట్టుబడి ఉన్నట్లు ఫ్రెంచ్‌ రాయబారి ఎమాన్యుయెల్‌ లెనాయిన్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కారణంగా వీటి తరలింపులో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఫ్రాన్స్‌ ఈ విధంగా స్పందించింది. తొలుత కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొదటి బ్యాచ్‌లో నాలుగు రఫేల్‌ విమానాలను సాధ్యమైనంత త్వరగా భారత్‌కు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది.

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావంతో ఫ్రాన్స్‌ విలవిలలాడుతోంది. ఇప్పటికే ఫ్రాన్స్‌లో లక్షా 45వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో 28,330మంది మృత్యువాతపడ్డారు. దీంతో రఫేల్‌ యుద్ధవిమానాలను భారత్‌కు అప్పగించడంలో జాప్యం ఏర్పడుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్‌ స్పందించింది.

లాక్‌డౌన్‌ కారణంగా రఫేల్‌ యుద్ధవిమానాల రాక మరికొన్ని వారాలపాటు ఆలస్యం కానుందని గతనెలలో భారతీయ వైమానిక దళ వర్గాలు వెల్లడించాయి. తొలుత కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొదటి బ్యాచ్‌ రఫేల్‌ విమానాలు మే చివరికల్లా భారత్‌కు చేరాల్సి ఉంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన ఈ విమానాలు అత్యాధునికమైనవి కావడంతో వీటికి సంబంధించి భారత వాయుసేన పైలట్లకు శిక్షణ ఇస్తున్నారు. దాదాపు రూ.58వేల కోట్లతో 36అత్యాధునిక రఫేల్‌ యుద్ధవిమానాలను ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని