Afghanistan: అఫ్గాన్‌ను ఉగ్రవాదులకు అడ్డా కానివ్వొద్దు!

అఫ్గానిస్థాన్‌ ఉగ్రవాదులకు సురక్షిత అడ్డాగా మారకుండా చూడాలని భారత్, అమెరికాలు తాలిబన్లను కోరాయి. ..

Updated : 30 Oct 2021 13:29 IST

తాలిబన్లకు అమెరికా-భారత్‌ సూచన

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ ఉగ్రవాదులకు సురక్షిత అడ్డాగా మారకుండా చూడాలని భారత్, అమెరికాలు తాలిబన్లను కోరాయి. ఉగ్రవాదం అణచివేతపై ఉభయ దేశాల అధికారుల మధ్య ఈనెల 26, 27 తేదీల్లో చర్చలు జరిగాయి. ఈమేరకు గురువారం ఓ సంయుక్త ప్రకటన విడుదల అయింది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రత మండలి నిషేధించిన ఉగ్రవాద ముఠాలు (ఆల్‌-ఖైదా, ఐఎస్‌ఐఎస్, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌) సహా అన్ని ముష్కర గ్రూపులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రెండు దేశాలూ పిలుపునిచ్చాయి. భారత్‌-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ‘ఉగ్రవాద నిరోధానికి సహకారం’ అనేది మూలస్తంభంగా నిలుస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దిశగా సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలూ ప్రతిన బూనాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం జరుపుతున్న పోరులో కలిసి పనిచేసేందుకు నిబద్ధతతో ఉన్నట్లు అమెరికా పునరుద్ఘాటించింది. ఈ సందర్భంగా ముష్కరుల చర్యలను, సీమాంతర ఉగ్రవాదాన్ని ఉభయ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఐరాస భద్రత మండలి తీర్మానం 2593 కింద.. అఫ్గాన్‌ ప్రాంతం ఉగ్రవాదులకు ఎలాంటి ఆశ్రయం, శిక్షణ ఇచ్చేదిగా ఉండరాదని స్పష్టం చేశాయి. ఉగ్రదాడులకు కుట్ర పన్నేందుకు, ఆర్థిక సాయం అందించేందుకు ఆఫ్గన్‌ అడ్డాగా మారకుండా చూడాలని తాలిబన్లకు సూచించాయి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని