వాతావరణ మార్పులపై సమయం మించిపోతోంది

పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న కీలక లక్ష్యాన్ని ప్రపంచ దేశాలు అందుకోలేకపోవచ్చని వాతావరణ మార్పులపై ఏర్పడ్డ ఐరాస కమిటీ- ఐపీసీసీ హెచ్చరించింది.

Published : 21 Mar 2023 05:40 IST

‘1.5 డిగ్రీల సెల్సియస్‌’ లక్ష్య సాధనకు   సత్వర చర్యలు అవసరం
ఐపీసీసీ హెచ్చరిక  

దిల్లీ: పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న కీలక లక్ష్యాన్ని ప్రపంచ దేశాలు అందుకోలేకపోవచ్చని వాతావరణ మార్పులపై ఏర్పడ్డ ఐరాస కమిటీ- ఐపీసీసీ హెచ్చరించింది. అయితే ఈ దశాబ్దంలో శరవేగంగా చేపట్టే ఉపశమన చర్యలతో ఈ పరిస్థితిని నివారించొచ్చని తన తాజా ‘సింథసిస్‌ రిపోర్ట్‌’లో పేర్కొంది.  1.5 డిగ్రీల సెల్సియస్‌ లక్ష్య సాధనకు అన్ని రంగాల్లోనూ గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల తగ్గింపు వేగంగా, నిరంతరంగా సాగాలని తేల్చిచెప్పింది.  ‘‘ఇప్పుడు మనం చర్యలు చేపడితే.. అందరికీ ఆవాసయోగ్య పరిస్థితులను కల్పించొచ్చు’’ అని ఐపీసీసీ ఛైర్‌పర్సన్‌ హోసంగ్‌ లీ పేర్కొన్నారు. మానవాళి చాలా పలుచటి హిమఫలకంపై ఉందని, అది కూడా వేగంగా కరిగిపోతోందని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు. ‘‘ఇది ఒక టైమ్‌ బాంబ్‌ లాంటిది. సమయం మించిపోతోంది. వాతావరణ కార్యాచరణలో పెద్ద ముందడుగు వేస్తే 1.5 డిగ్రీల సెల్సియస్‌ లక్ష్యాన్ని సాధించొచ్చు’’ అని పేర్కొన్నారు. ధనిక దేశాలు 2040 నాటికి ‘నెట్‌ జీరో’ ఉద్గార స్థాయిని సాధించాలన్నారు. వర్ధమాన దేశాలు 2050లో ఈ లక్ష్యాన్ని అందుకోవాలని కోరారు. ‘ఓఈసీడీ’ దేశాలు 2030 కల్లా బొగ్గు వినియోగాన్ని ఆపేయాలని, మిగతా దేశాలు 2040 కల్లా ఆ లక్ష్యాన్ని అందుకోవాలన్నారు. ఈ నివేదికను భారత్‌ స్వాగతించింది. వనరులను ఆచితూచి వినియోగించాలన్న ప్రధాని మోదీ దార్శనికతకు ఇది అద్దం పడుతోందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ పేర్కొన్నారు. వాతావరణ కార్యాచరణకు అభివృద్ధి చెందిన దేశాల నుంచి వర్ధమాన దేశాలకు అందుతున్న నిధులు ఏ మాత్రం సరిపోవన్నారు.

ఐపీసీసీ నివేదికలోని అంశాలివీ..

ప్రపంచవ్యాప్తంగా 10 శాతం కుటుంబాల తలసరి కర్బన ఉద్గారాలు అధికంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని కుటుంబాలు వెలువరించే ఉద్గారాల్లో వీరి వాటా 35-45 శాతంగా ఉంది. ఈ జాబితాలో కింది స్థాయిలో ఉన్న 50 శాతం కుటుంబాలు కేవలం 13-15 శాతం ఉద్గారాలను వెలువరిస్తున్నాయి.

భూతాపంలో పెరుగుదలకు శిలాజ ఇంధనాల వినియోగమే ప్రధాన కారణం. 2019లో ప్రపంచ గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల్లో 79 శాతం.. ఇంధనం, పరిశ్రమలు, రవాణా, భవనాల నుంచే వచ్చాయి. వ్యవసాయం, అడవులు, ఇతర రంగాల వాటా 21 శాతం.  

వాస్తవ అవసరాలకు అనుగుణంగా వర్ధమాన దేశాలు, ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, సమూహాలకు వాతావరణ కార్యాచరణ నిధులను ధనిక దేశాలు అందించాలి.

1.5 డిగ్రీల లక్ష్యాన్ని సాధించాలంటే 2030 నాటికి కర్బన ఉద్గారాలను సగానికి తగ్గించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని