మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌కు జీవితఖైదు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ ప్రజాప్రతినిధుల కోర్టు 2006 నాటి ఉమేశ్‌పాల్‌ అపహరణ కేసులో గ్యాంగ్‌స్టర్‌, సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ను మంగళవారం దోషిగా తేల్చింది.

Published : 29 Mar 2023 05:59 IST

2006 నాటి కిడ్నాప్‌ కేసులో  కోర్టు తీర్పు

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ ప్రజాప్రతినిధుల కోర్టు 2006 నాటి ఉమేశ్‌పాల్‌ అపహరణ కేసులో గ్యాంగ్‌స్టర్‌, సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ను మంగళవారం దోషిగా తేల్చింది. అహ్మద్‌ సోదరుడు ఖలీద్‌ అజీంతోపాటు మరో ఆరుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ కేసులో అహ్మద్‌తోపాటు న్యాయవాది సౌలత్‌ హనీఫ్‌, దినేశ్‌ పాసీ అనే మరో ఇద్దరిని దోషులుగా తేల్చారు. ఈ ముగ్గురికీ కఠిన జీవితఖైదు, రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు. జరిమానాను బాధిత కుటుంబానికి అందజేయాలని కోర్టు ఆదేశించినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్‌ హత్యకేసులో అతీక్‌ అహ్మద్‌ ప్రధాన నిందితుడు కాగా, ఈ కేసులో నాటి జడ్పీ సభ్యుడైన ఉమేశ్‌పాల్‌ ప్రధానసాక్షి. ఇప్పటిదాకా అహ్మద్‌పై నమోదైన వందకు పైగా కేసుల్లో శిక్షపడిన కేసు ఇదే మొదటిది కావడం విశేషం. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్‌పాల్‌ను ప్రయాగ్‌రాజ్‌లో దుండగులు బహిరంగంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంలోనూ అహ్మద్‌, అష్రఫ్‌ సోదరులపై నమోదైన కుట్రకేసు విచారణలో ఉంది. కోర్టు తీర్పు అనంతరం నైనీ (యూపీ) కేంద్ర కారాగారానికి అహ్మద్‌ను తిరిగి తీసుకువెళుతుండగా పోలీసు వ్యాన్‌ లోపలి నుంచి ఆయన మాట్లాడుతూ.. ‘నేను కోర్టును గౌరవిస్తా. కానీ, ఈ తీర్పు సరికాదు. దీనిపై హైకోర్టుకు వెళతా’ అని ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు