బెంగాల్‌లో ‘ద కేరళ స్టోరీ’ నిషేధంపై స్టే

మత మార్పిళ్లు, ఉగ్రవాదం కథనాంశాలుగా నిర్మించిన ‘ద కేరళ స్టోరీ’ చిత్రంపై పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు గురువారం నిలిపివేసింది.

Updated : 19 May 2023 05:50 IST

తమిళనాడులో భద్రత కల్పించాలి : సుప్రీంకోర్టు
‘డిస్‌క్లెయిమర్‌’ జోడించాలని నిర్మాతకు ఆదేశం

దిల్లీ: మత మార్పిళ్లు, ఉగ్రవాదం కథనాంశాలుగా నిర్మించిన ‘ద కేరళ స్టోరీ’ చిత్రంపై పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు గురువారం నిలిపివేసింది. ఈ సినిమా కేంద్ర బోర్డు (సీబీఎఫ్‌సీ) నుంచి ధ్రువీకరణ పొందినందున శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. తమిళనాడులోనూ ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు రక్షణ కల్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. 32 వేలమంది హిందూ, క్రిస్టియన్‌ మహిళలను ఇస్లాం మతంలోకి మార్చినట్లు చిత్రంలో ఉన్న సన్నివేశానికి సరైన ఆధారం చూపనందున మే 20 సాయంత్రంలోపు ‘డిస్‌క్లెయిమర్‌’ నోటీసును ప్రింట్లకు జత చేయాలని నిర్మాతకూ కోర్టు సూచించింది. ఈ చిత్రాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సీబీఎఫ్‌సీ ధ్రువీకరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు ఈ చిత్రాన్ని ఓసారి చూడాలని అనుకొంటున్నట్లు కోర్టు తెలిపింది.

‘ప్రజల అసహనాన్ని కారణంగా చూపుతూ చట్టపరమైన నిబంధనలను ఉపయోగించలేరు. ఇలాగైతే అన్ని సినిమాలదీ ఇదే పరిస్థితి అవుతుంది’ అని జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పర్దీవాలాలతో కూడిన సీజేఐ ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది. తమ చిత్రంపై ఆంక్షలను సవాలు చేస్తూ ఈ చిత్ర నిర్మాత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు.. చిత్రం విడుదలపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జర్నలిస్ట్‌ ఖుర్బాన్‌ అలి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. నిర్మాత తరఫున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పుపై టీఎంసీ సీనియర్‌ నేత కునాల్‌ ఘోష్‌ స్పందిస్తూ.. కోర్టు ఆదేశాలతో సినిమా ప్రదర్శనలు మళ్లీ మొదలై వివాదాలు చెలరేగితే ప్రతిపక్షం తమను నిందించరాదని స్పష్టం చేశారు. 

జ్ఞానవాపి మసీదు తరఫు వాదనలు వినేందుకు అంగీకారం

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం వయసు నిర్ధారణకు కార్బన్‌ డేటింగ్‌ పరీక్ష నిర్వహించాలంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ తరఫున హాజరైన న్యాయవాది హుజెఫా అహ్మదీ దాఖలు చేసిన ఫిర్యాదును  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. దీనిపై శుక్రవారం వాదనలు వింటామని తెలిపింది.

పార్థివదేహాల నిర్వహణలో జాతీయ విధానం అవసరం

మహమ్మారులు విజృంభించినప్పుడు లేదా సాధారణ సమయాల్లోనూ చనిపోయిన వ్యక్తుల పార్థివదేహాల గౌరవప్రద నిర్వహణపై జాతీయ విధానం అవసరమని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. కొవిడ్‌ మహమ్మారి సమయంలో చనిపోయిన తన తల్లి ముఖాన్ని(కడచూపు) చూడలేకపోయిన ఓ వ్యక్తి కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ జె.బి.పార్దివాలాలతో కూడిన ధర్మాసనం పై మేరకు వ్యాఖ్యానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు