అత్యాధునిక ఆత్మనిర్భర పతాక

అమృతోత్సవ వేళ.. ఆత్మ నిర్భరతకు ప్రతీకగా సరికొత్త పార్లమెంటు భవనం ఆరంభానికి సిద్ధమైంది. సనాతన కళాకృతులతో, ఆధునిక హంగులతో, దూరదృష్టితో, భారతీయ నిర్మాణ కౌశలంతో నిర్మించిన ఈ ప్రజాస్వామ్య దేవాలయం ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతం కాబోతోంది.

Updated : 25 May 2023 10:54 IST

సంప్రదాయ శైలికి ప్రతిరూపం
ఆధునిక పార్లమెంటు భవనం ఓ కళాఖండం
రూ.1200 కోట్లకు పైగా వ్యయం
28న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

అమృతోత్సవ వేళ.. ఆత్మ నిర్భరతకు ప్రతీకగా సరికొత్త పార్లమెంటు భవనం ఆరంభానికి సిద్ధమైంది. సనాతన కళాకృతులతో, ఆధునిక హంగులతో, దూరదృష్టితో, భారతీయ నిర్మాణ కౌశలంతో నిర్మించిన ఈ ప్రజాస్వామ్య దేవాలయం ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతం కాబోతోంది. ప్రస్తుత వృత్తాకార పాత భవనం పక్కనే స్వదేశీ ఆలోచనలతో త్రికోణాకారంలో సుమారు రూ.1200 కోట్లకుపైగా వ్యయంతో సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా రూపుదిద్దుకుంది ఈ కొత్త భవంతి. రాజ్‌పథ్‌ ఆధునికీకరణ, ప్రధాన మంత్రికి కొత్త నివాసం, కొత్త కార్యాలయం, ఉపరాష్ట్రపతి కొత్త కార్యాలయం ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.

కొత్తది ఎందుకంటే..

ప్రస్తుత పార్లమెంటు భవనానికి 1921లో శంకుస్థాపన చేశారు. ఆంగ్లేయుల ఆలోచనలకు, అప్పటి అవసరాలకు అనుగుణంగా ఆరేళ్లలో (1927లో) అది సిద్ధమైంది. బ్రిటిష్‌ హయాంలో కౌన్సిల్‌ హౌస్‌గా పిలిచిన ఇందులోనే ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ కొలువుదీరేది. 1956లో ప్రస్తుత భవనానికి రెండు అంతస్థులు అదనంగా కలిపారు. కాలానుగుణంగా అప్పటికి ఇప్పటికీ అవసరాలు పెరిగాయి. స్థలపరంగానూ ఇరుకుగా మారింది. సమావేశాలకే ఇబ్బందిగా ఉంది. ఉభయ సభల సంయుక్త సమావేశానికి సెంట్రల్‌ హాలున్నా అందులో 436 మందే కూర్చోవచ్చు. సంయుక్త సమావేశం నిర్వహించినప్పుడల్లా దాదాపు 200 కుర్చీలను తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సి వచ్చేది. అంతేగాకుండా వందేళ్లకు చేరుకుంటున్న ఈ భవంతిలో కొత్తగా ఎలక్ట్రిక్‌ కేబుళ్లు, సీసీ టీవీలు, శీతలీకరణ, ఆడియో వీడియో తదితరాల కోసం ఎప్పటికప్పుడు అదనంగా ఏర్పాట్లు చేయడంతో భవనం పటిష్ఠత దెబ్బతింది. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్‌విభజన జరిగే అవకాశం ఉంది. అప్పుడు సీట్లు పెరుగుతాయి. అందుకు ప్రస్తుత పార్లమెంటు భవనం సరిపోదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొత్త భవనం నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది.

సంయుక్త సభలిక అక్కడే

పాత దానిలో మాదిరిగా సెంట్రల్‌ హాలులాంటిదేమీ కట్టలేదు. ఉభయ సభల సంయుక్త సమావేశాలకు లోక్‌సభనే వాడుకుంటారు. 888 సీట్లున్న లోక్‌సభ హాలులో మొత్తం 1272 సీట్లకు వెసులుబాటుంది.

సభ్యుడి సీటు వద్దే మల్టీమీడియా

సభ్యుల ఓటింగ్‌కు వీలుగా సీట్లలో బయోమెట్రిక్‌, డిజిటల్‌ అనువాద పరికరాలు, మార్చుకోగల మైక్రోఫోన్లు తదితరాలను అమర్చారు. ప్రతి సభ్యుడి సీటువద్దా మల్టీమీడియా డిస్‌ప్లే సదుపాయం ఉంటుంది. సామాన్యులు గ్యాలరీల్లో ఎక్కడ కూర్చుని చూసినా స్పష్టంగా కనిపించేలా సీట్లను ఏర్పాటు చేశారు. మీడియాకూ ప్రత్యేక, ఆధునిక ఏర్పాట్లు చేశారు. మొత్తం 530 సీట్లను మీడియాకు కేటాయించారు.


పార్లమెంటు కొత్త భవనానికి జ్ఞాన, శక్తి, కర్మ ద్వారాలు

ఈనాడు, దిల్లీ: త్రిభుజాకారంగా నిర్మించిన నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మలుగా నామకరణం చేసినట్లు తెలిసింది. ఈ మూడు ద్వారాల పక్కన వేల సంవత్సరాల భారతీయ చరిత్రను తెలిపే కాంస్య చిత్రాలను ఏర్పాటు చేశారు. జ్ఞాన ద్వారానికి ఒకవైపున గార్గి-యాజ్ఞవల్క్య మధ్య జరిగిన సంవాద దృశ్యం, మరోవైపున నలంద చిత్రాలను నెలకొల్పుతున్నారు. శక్తి ద్వారానికి ఒకవైపున చాణక్య, మరోవైపున మహాత్మా గాంధీ దండి యాత్ర దృశ్యాలను ఏర్పాటు చేస్తున్నారు. కర్మ ద్వారానికి ఒకవైపు కోణార్క్‌ చక్రం, మరోవైపున సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాలను నెలకొల్పుతున్నారు. ఇంకోవైపు పార్లమెంటు భవనం లోపల ఇండియన్‌ గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో అన్ని రాష్ట్రాలకు చెందిన పెయింటింగ్స్‌, శిల్పకళలను ఉంచుతున్నారు. భవనం ప్రారంభోత్సవానికి ఎంపీలను ఆహ్వానిస్తూ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ ఇప్పటికే ఆహ్వాన పత్రాలు పంపారు. ఈ భవనాన్ని 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన మంత్రి ప్రారంభించనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇందులో స్పీకర్‌ ఓం బిర్లా పాల్గొనబోతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఆహ్వాన పత్రంపై రాజ్యసభ ఛైర్మన్‌ పేరు లేకపోవడాన్ని కాంగ్రెస్‌ ఎంపీ వివేక్‌ థంకా తప్పుబట్టారు. ఈ కార్డుపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ పేరు ఎందుకు లేదని ఆయన ట్విటర్‌లో ప్రశ్నించారు.



ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని