కడచూపు కోసం.. కన్నీటి వెతుకులాట

ఒకవైపు శవాగారంలో కుప్పలుగా మృతదేహాలు. కానీ ముఖాలు ఛిద్రమవడంతో.. చనిపోయింది ఎవరో గుర్తుపట్టలేని దుస్థితి.

Updated : 06 Jun 2023 07:28 IST

ఒడిశా ప్రమాద బాధిత  కుటుంబికుల దైన్యం
భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ శవాగారం వద్ద పడిగాపులు
భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి 

ఒకవైపు శవాగారంలో కుప్పలుగా మృతదేహాలు. కానీ ముఖాలు ఛిద్రమవడంతో.. చనిపోయింది ఎవరో గుర్తుపట్టలేని దుస్థితి. మరోవైపు తమవారి ఆచూకీ తెలియక కుటుంబికులు, బంధువుల అవస్థలు.. కనీసం మృతదేహాలైన కనిపించకపోవడంతో మిన్నంటుతున్న రోదనలు. ఒడిశా రైళ్ల ప్రమాదంతో నెలకొన్న దయనీయ పరిస్థితులివి. తమవారు బతికి ఉండొచ్చన్న ఆశ దాదాపుగా కొడిగట్టడంతో.. భౌతికకాయాలనైనా గుర్తించి అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న తపనతో భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ శవాగారానికి ప్రమాద బాధితుల సంబంధికులు భారీగా తరలివస్తున్నారు.

177 మృతదేహాల అప్పగింత

బాలేశ్వర్‌లో ప్రమాదం జరిగి అయిదు రోజులవుతోంది. ఈ దుర్ఘటనలో 278 మంది మృతిచెందగా... సోమవారం సాయంత్రం వరకూ 177 మృతదేహాలను గుర్తించి, వారి సంబంధికులకు అప్పగించారు. మరో 101 భౌతికకాయాలు ఎవరివనేది ఇంకా తేలలేదు. అవన్నీ భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ శవాగారంలో పేరుకుపోయాయి. మృతుల్లో తమవారు ఉన్నారేమో చూసేందుకు బాధితుల కుటుంబికులు, స్నేహితులు, బంధువులు అక్కడికి తరలివస్తున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకూ తమవారి ఆచూకీ లభించకపోవడంతోపాటు ఆసుపత్రులన్నీ వెతికినా కనిపించకపోవటంతో వారు మరణించి ఉంటారనే నిర్ధారణకు వచ్చి.. మృతదేహాల కోసం శవాగారాల వద్ద వెతుకుతున్నారు.

దొరికింది ఒకరి మృతదేహమే

బిహార్‌లోని మధుబన్‌ జిల్లా జానకీనగర్‌ గ్రామానికి చెందిన కుల్‌దీప్‌ ఠాకుర్‌, మనోజ్‌ రాయ్‌, రంజిత్‌ రాయ్‌, రామ్‌ భరోసా ఠాకూర్‌, అమిత్‌ మండల్‌, సలాం రైన్‌లు కలిసి కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై వెళ్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. వారంతా పాతికేళ్ల లోపు యువకులే. దుర్ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకూ వీరి ఆచూకీ లేదు. గాయపడి ఎక్కడైనా చికిత్స తీసుకుంటున్నారమోనన్న ఉద్దేశంతో వారి స్నేహితులు.. బాలేశ్వర్‌, కటక్‌, భువనేశ్వర్‌లలోని అన్ని ఆసుపత్రులనూ గాలించారు. అయినా ఫలితం లేదు. చివరికి సోమవారం సాయంత్రానికి కుల్‌దీప్‌ ఠాకుర్‌ ఒక్కరి మృతదేహం మార్చురీలో లభించింది. మిగతా అయిదుగురూ చనిపోయే ఉంటారని భావిస్తున్నామని వారి స్నేహితుడు, జానకీనగర్‌ గ్రామస్థుడు లక్ష్మీకుమార్‌ షా ‘ఈనాడు’కు చెప్పారు. కానీ వారి మృతదేహాలు లభించకపోవటం, ఆచూకీ తెలియకపోవటం తమకు పెద్ద సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. 

దుర్గంధం మధ్యే దుర్భర పరిస్థితుల్లో..

దుర్ఘటన చోటుచేసుకొని అయిదు రోజులవుతుండటంతో మృతదేహాలు పాడవుతున్నాయి. ప్రమాదం జరిగాక భౌతికకాయాలను తొలుత బహానగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భద్రపరిచారు. రెండోరోజు బాలేశ్వర్‌లోని నోసీ ఇండస్ట్రీయల్‌ పార్కుకు తరలించారు. సోమవారం నాటికి వాటిని భువనేశ్వర్‌ ఎయిమ్స్‌లోని శవాగారాల్లో భద్రపరిచారు. ఇలా ఒకచోట నుంచి మరో చోటకు మార్చడం, సరిగ్గా భద్రపరచకపోవటంతో మృతదేహాల నుంచి భరించలేనంత దుర్గంధం వస్తోంది. వాటి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేని స్థితి నెలకొంది. అలాంటి దుర్భర పరిస్థితుల మధ్యే మృతదేహాల కోసం వెతుకుతున్నారు.


భర్త జాడ తెలియక..

డిశాకు చెందిన కార్తీక్‌ బేర విజయవాడలోని ఓ హోటల్‌లో పనిచేసేవారు. విజయవాడ నుంచి ఒడిశాలోని తన స్వగ్రామానికి వస్తున్న సమయంలో రైలు ప్రమాదం బారిన పడి ఉంటారని ఆయన కుటుంబికులు భావిస్తున్నారు. దుర్ఘటన జరిగినప్పటి నుంచి ఆయన ఫోన్‌ పనిచేయడం లేదు. కార్తీక్‌ ఆచూకీ తెలియక ఆయన భార్య రమామాణి బేర కన్నీరుమున్నీరవుతున్నారు. సోమవారం ఆమె శవాగారం వద్ద పడిగాపులు కాశారు. అక్కడున్న మృతదేహాలన్నీ ఒకటికి రెండుసార్లు చూశారు. వాటిలో కార్తీక్‌ భౌతికకాయం దొరకలేదు. 


మృతదేహాలను గుర్తించండి

ఫొటోలు విడుదల చేసిన రైల్వే శాఖ

ఈనాడు, దిల్లీ: ఒడిశా దుర్ఘటనలో చనిపోయినవారి గుర్తింపు కష్టం కావడంతో రైల్వేశాఖ అందుకు సంబంధించిన ఫొటోలు విడుదల చేసింది. ఇప్పటివరకూ తమవారి ఆచూకీ తెలియక ఆందోళన చెందుతున్నవారిని దృష్టిలో ఉంచుకొని చనిపోయినవారు, వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు, గుర్తించలేనంతగా ఛిద్రమైన మృతదేహాల సమాచారాన్ని ఒడిశా ప్రభుత్వ స్పెషల్‌ రిలీఫ్‌ కమిషనర్‌, భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్లలో ఉంచింది. చనిపోయినవారి ఫొటోలను https://srcodisha.nic.in/Photos%20Of%20Deceased%20with%20Disclaimer.pdf  లింక్‌లో ఉంచింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి జాబితాను https://www.bmc.gov.in/train-accident/downloadists-of-Passengers-Undergoing-Treatment-in-Different-Hospitals_040620230830.pdf లింక్‌తో జత చేసింది. కటక్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న గుర్తుతెలియని వ్యక్తుల ఫొటోలను https://www.bmc.gov.in/train-accident/download/Un-identified-person-under-treatment-at-SCB-Cuttack.pdf లో ఉంచింది. అవసరమైనవారు రైల్వే హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 139కిగానీ, భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 18003450061/1929కిగానీ ఎప్పుడైనా ఫోన్‌ చేయొచ్చని రైల్వే శాఖ తెలిపింది. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటుచేశారని, అక్కడినుంచి వాహనాలను క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రుల వద్దకు, మృతదేహాలు ఉంచిన మార్చురీకి తీసుకెళ్తారని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని