Odisha Train Accident: చనిపోయాడనుకొని ట్రక్కులో ఎక్కించారు.. రైలు ప్రమాద ఘటనలో దారుణం

ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని చనిపోయినట్టు భావించి మృతదేహాలు తరలించే లారీలో ఎక్కించారు. కానీ, తను ప్రాణాలతోనే ఉన్నానని సహాయక సిబ్బందికి తెలియజేశాడు. 

Updated : 06 Jun 2023 10:42 IST

కోల్‌కతా: ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని చనిపోయినట్టు భావించి మృతదేహాలు తరలించే లారీలో ఎక్కించారు. కానీ, తను ప్రాణాలతోనే ఉన్నానని సహాయక సిబ్బందికి తెలియజేశాడు.  ప్రస్తుతం ఆ బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన రోజు పశ్చిమబెంగాల్‌కు చెందిన బిశ్వజిత్‌ మాలిక్‌ కూడా షాలిమర్‌ స్టేషన్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు. బాలేశ్వర్‌ ప్రాంతంలో రైలు ప్రమాదానికి గురైంది. బిశ్వజిత్‌ కుడి చేతికి తీవ్ర గాయం కావడంతో ఎటూ కదలలేకపోయాడు. అంతలో కొంతమంది రైలులో చిక్కుకుపోయిన వారిని బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయం బాధిస్తున్నా.. బిశ్వజిత్‌ తన శక్తినంతా కూడదీసుకుని రైలు నుంచి బయటపడ్డాడు. ఎటూ కదల్లేని పరిస్థితి. సహాయం కోసం పిలుద్దామన్నా నోట్లోంచి మాట రావడంలేదు. మెల్లిగా కళ్లు మూతలుపడుతున్నాయి.. చుట్టుపక్కల చూసేందుకు ప్రయత్నిస్తున్నా సాధ్యంకాలేదు.

కొద్దిసేపటి తర్వాత మెలకువ వచ్చింది. తన జేబులో ఉన్న ఫోన్‌ మోగుతున్నట్లు అనిపించింది. లేచిచూస్తే.. తనకి రెండు వైపులా కొంతమంది అచేతనంగా పడి ఉన్నారు. అప్పుడు అర్థమైంది బిశ్వజిత్‌కు.. తను కూడా చనిపోయానని భావించి, మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటు చేసిన లారీలో ఎక్కించారని. వెంటనే అక్కడున్న వారికి తాను బతికే ఉన్నానని తెలిసేలా తన ఎడమచేతిని పైకెత్తాడు.గమనించిన సహాయక సిబ్బంది.. బిశ్వజిత్‌ను చికిత్స కోసం గోపాల్‌పుర్‌ ఆసుపత్రికి తరలించారు. తర్వాత తన తండ్రికి ఫోన్‌లో పరిస్థితి వివరించడంతో.. ఆయన గోపాల్‌పుర్‌ ఆస్పత్రికి చేరుకుని బిశ్వజిత్‌ను కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎమ్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బిశ్వజిత్‌ పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఒకవేళ తనకు మెలకువ రాకపోతే చనిపోయిన వారితోపాటు తనను కూడా తరలించేవారని, దేవుడి దయతో బతికి భయపడ్డానని బిశ్వజిత్‌ చెమ్మగిల్లిన కళ్లతో చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని