Delhi High Court: ఖైదీలకూ సంతానోత్పత్తి హక్కు

తమ వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకూ ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న వ్యక్తికి నాలుగు వారాల పాటు పెరోల్‌ మంజూరు చేసింది.

Updated : 29 Dec 2023 09:33 IST

దిల్లీ హైకోర్టు స్పష్టీకరణ
శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి 4 వారాల పెరోల్‌ మంజూరు

దిల్లీ: తమ వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకూ ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న వ్యక్తికి నాలుగు వారాల పాటు పెరోల్‌ మంజూరు చేసింది. తన భర్త ద్వారా సంతానాన్ని పొందే అవకాశం కల్పించాలన్న అతని భార్య అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటూ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. భార్య వయసు 38 ఏళ్లు, భర్త వయసు 41 ఏళ్లను ప్రస్తావిస్తూ....శిక్షా కాలం పూర్తయ్యాక ఆ దంపతులకు సంతానాన్ని పొందే వయసు మీరిపోతుందని, వయోభారం వారి ఉమ్మడి ఆకాంక్షకు అవరోధంగా మారుతుందని జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ అభిప్రాయపడ్డారు. తన భర్త ద్వారా సంతానాన్ని పొందాలన్న భార్య హక్కును ప్రభుత్వం అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత కేసులోని పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత ఖైదీకి తన వంశాన్ని నిలుపుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తీర్పులో వివరించారు. దాంపత్య జీవనం కోసం అనుమతివ్వడం లేదని, వంశాన్ని నిలబెట్టుకోవాలన్న భార్య ఆకాంక్షను, హక్కును గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఖైదీ ఇప్పటికే 14 ఏళ్లుగా జైలులో ఉన్న విషయాన్నీ న్యాయమూర్తి ప్రస్తావించారు. పెరోల్‌ కోసం రూ.20 వేలకు వ్యక్తిగత బాండును సమర్పించడంతో పాటు ఒకరి పూచీకత్తు ఇవ్వాలని షరతు విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు