బడ్జెట్‌పై ఎవరు ఏమన్నారంటే..

సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం తాత్కాలిక బడ్జెట్‌-2024ను ప్రవేశపెట్టారు.

Updated : 02 Feb 2024 05:58 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం తాత్కాలిక బడ్జెట్‌-2024ను ప్రవేశపెట్టారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించే అద్భుతమైన బడ్జెటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి పక్షాలు స్వాగతించాయి. వైఫల్యాలకు విజయాల ముసుగు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి.


మోదీజీ నిబద్ధతకు అద్దం

ఆర్థికరంగంలో సూపర్‌ పవర్‌గా శరవేగంగా భారత్‌ చెందుతున్న రూపాంతరాన్ని ఈ బడ్జెట్‌ ముందుకు తీసుకువెళుతుంది. రైతులు, మహిళలు, యువత, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలన్న ప్రధాని మోదీజీ నిబద్ధతకు బడ్జెట్‌ దోహదం చేస్తుంది. దేశ సమగ్రాభివృద్ధికి స్పష్టమైన మార్గం చూపుతున్న ఈ బడ్జెట్‌ సమాజంలోని భిన్న వర్గాలకు ప్రయోజనాలు అందించి, నవభారతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చాటుతోంది.

నితిన్‌ గడ్కరీ, రోడ్డురవాణా, హైవేల మంత్రి


అన్ని వర్గాలకు సానుకూల బడ్జెట్‌

అందరం స్వాగతించదగిన సానుకూల బడ్జెట్‌ ఇది. రైల్వేలపరంగా మూడు కొత్త ఆర్థిక కారిడార్ల ఏర్పాటుకు నిర్ణయించడం బాగుంది. దేశ ఆర్థికప్రగతికి ఇది దోహదం చేస్తుంది. మధ్యతరగతికి ప్రత్యేక గృహనిర్మాణ పథకం, ఉపాధిహామీ బడ్జెటును రూ.60 వేల కోట్ల నుంచి రూ.86 వేల కోట్లకు పెంచడం, స్టార్టప్‌ కంపెనీలకు పన్ను ప్రయోజనాలు అభినందనీయం.

నీతీశ్‌కుమార్‌, బిహార్‌ ముఖ్యమంత్రి (జేడీయూ అధినేత)


చైనా జీడీపీ 5.5 రెట్లు ఎక్కువ

ఇది ధనికుల కోసం ధనికులు నడుపుతున్న ధనికుల ప్రభుత్వం. జీడీపీ గురించి మాట్లాడిన ఆర్థికమంత్రి తలసరి ఆదాయం మాటెత్తలేదు. ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం 7.7% ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ అని చెప్పుకోవడం ఒక్కటే గౌరవం కాదు. మన జీడీపీ కంటే చైనా జీడీపీ 5.5 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ ప్రభుత్వ పాలనలో దిగువన ఉన్న 50 శాతం ప్రజలను మరచిపోవడంతో ఆర్థికవ్యవస్థ దారుణంగా తయారైంది.

పి.చిదంబరం, మాజీ ఆర్థికమంత్రి (కాంగ్రెస్‌)


ధనవంతులకే లబ్ధి

దేశంలో శ్రామికవర్గం ఎదుర్కొంటున్న భయంకరమైన ఆర్థిక పరిస్థితిని కేంద్ర తాత్కాలిక బడ్జెట్‌ వెల్లడించింది. ప్రభుత్వ అభివృద్ధి ఆలోచనలు ధనవంతులను మరింత ధనవంతులుగా, పేదలను మరింత పేదలుగా మార్చేలా ఉన్నాయి. సామాజికరంగాల వ్యయం తగ్గింది. ఇది దేశ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది.

 సీపీఎం


రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?

కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెటు ఎన్నికల గిమ్మిక్కులా ఉంది. దేశంలో ప్రతిరోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకొంటున్నారు. అన్నదాతల సంక్షేమం గురించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రసంగం గత అయిదేళ్లలో జరిగిన 53,478 మంది రైతుల ఆత్మహత్యలను గేలి చేసినట్టుగా ఉంది. రాష్ట్రాలకు నిధుల కేటాయింపు ఊసే లేదు. సమాఖ్య వ్యవస్థను మోసగించి, ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నారు.

డెరెక్‌ ఓబ్రియెన్‌, ఎంపీ.. చంద్రిమా భట్టాచార్య (ప.బెంగాల్‌ మంత్రి), టీఎంసీ


రామరాజ్య దృక్పథం గల బడ్జెట్‌

  •  దేశంలో రామరాజ్య స్థాపన దృక్పథానికి కేంద్ర బడ్జెట్‌ అద్దం పట్టింది. ఇది దేశ స్వావలంబనకు చేసిన ప్రతిజ్ఞలా ఉంది. మధ్యతరగతికి గృహనిర్మాణ పథకం ప్రతిపాదన విప్లవాత్మకమైన ముందడుగు. పేదల సంక్షేమానికి అంకితమైన దూరదృష్టి గల బడ్జెట్‌ ఇది. 

 జె.పి.నడ్డా, భాజపా అధ్యక్షుడు

  •  ఇది సానుకూల బడ్జెట్‌. సమాజంలోని ప్రతి వర్గానికి ఎంతోకొంత లబ్ధి చేకూర్చేలా ఉంది. మౌలిక సదుపాయాలు, నిర్మాణరంగం, తయారీరంగం, గృహనిర్మాణం, సాంకేతిక అభివృద్ధి రంగాలకు పెద్దపీట వేశారు.

 రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణమంత్రి

  • మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలకు సమతుల్యమైన ప్రాధాన్యం ఇచ్చారు. ఆత్మనిర్భర్‌, వికసిత భారత్‌లకు పునాది వేసే సమగ్ర మార్గదర్శిగా బడ్జెట్‌ నిలుస్తోంది.

అనురాగ్‌ ఠాకుర్‌, కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి

  •  ప్రధాని మోదీ దూరదృష్టి, బలమైన నాయకత్వం కింద పేదలు, గ్రామీణ భారత సంక్షేమంలో భాగంగా అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌ కొత్త భాష్యం చెప్పింది. పీఎంఏవై (గ్రామీణ) పథకం కింద దాదాపు మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం మౌలిక వసతుల అభివృద్ధిలో ఓ మైలురాయి.

స్మృతి ఇరానీ, కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి

  •  భారత్‌ 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఈ బడ్జెటు బలమైన పునాది వేసింది.

అర్జున్‌ మేఘవాల్‌, న్యాయశాఖ మంత్రి


వైఫల్యాలకు విజయాల ముసుగు

బడ్జెట్‌ ప్రసంగం క్లుప్తంగా, అసంతృప్తి కలిగించేలా ఉంది. వైఫల్యాలకు విజయాల ముసుగు తొడిగే నైపుణ్యం ఈ సర్కారు సొంతం. దేశంలోని యువతలో 45% నిరుద్యోగులు ఉండగా, వారి సాధికారత గురించి మాట్లాడలేదు. మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు క్షీణిస్తున్న వాస్తవం కళ్ల ముందు కనిపిస్తుండగా మంత్రి ‘నారీశక్తి’ గురించి మాట్లాడారు. పెరుగుతున్న ద్రవ్యలోటు అత్యంత ఆందోళనకరం. మంత్రి చెప్పిన గణాంకాల మేరకే ఇది రూ.18 లక్షల కోట్ల మేర ఉంది. 

 శశిథరూర్‌, మనీశ్‌ తివారి, కాంగ్రెస్‌


ఆ 4 కులాలను ఇప్పటికైనా గుర్తించారు

మోదీ ప్రభుత్వ తుది బడ్జెట్‌ను చాలా భారమైన హృదయంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. దేశంలో పేదలు, మహిళలు, యువత, రైతులనే నాలుగు ‘కులాలు’ ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆ వర్గాలను గుర్తించింది.

 ఉద్ధవ్‌ఠాక్రే, మహారాష్ట్ర మాజీ సీఎం (శివసేన - యూబీటీ)

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు