వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం

భారత్‌లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) బుధవారం తెలిపింది.

Published : 09 May 2024 04:27 IST

భారత వైద్య పరిశోధన మండలి వెల్లడి
17 ఆహార మార్గదర్శకాల విడుదల

దిల్లీ: భారత్‌లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) బుధవారం తెలిపింది. స్థూలకాయం, మధుమేహం వంటి సాంక్రమికేతర వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన పోషకాలను పొందేందుకు 17 ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్యకర ఆహారం, శారీరక వ్యాయామంతో హృద్రోగాలు, బీపీ వంటివాటి ముప్పు అవకాశాలను గణనీయంగా తగ్గించుకోవచ్చునని, టైప్‌-2 మధుమేహాన్ని 80 శాతం వరకు నివారించవచ్చని ఐసీఎంఆర్‌కు చెందిన జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) తెలిపింది. ఆహారంలో తీసుకునే ఉప్పు శాతాన్ని నియంత్రించాలని, నూనె, కొవ్వులు వంటి వాటిని పరిమితంగా తీసుకోవాలని, శారీరక వ్యాయామం చేయడంతోపాటు, చక్కెర, బాగా శుద్ధిచేసిన ఆహార పదార్థాలను కనీస స్థాయిలో మాత్రమే తీసుకోవాలని సూచించింది. స్థూలకాయం బారిన పడకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలని, ఆహారం కొనే సమయంలో ఆ ప్యాకెట్లపై లేబుళ్లను నిశితంగా గమనించి ఆరోగ్యకర ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలని పేర్కొంది. ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.హేమలత నేతృత్వంలోని నిపుణులు భారతీయుల కోసం ఆహార మార్గదర్శకాలను (డీజీఐ) రూపొందించారని, అవి అనేక శాస్త్రీయ సమీక్షలకు గురయ్యాయని ఐసీఎంఆర్‌ తెలిపింది. అనంతరం 17 మార్గదర్శకాలను డీజీఐ జాబితాలో చేర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు