Somanath: నా పుస్తకంలో ఎవర్నీ టార్గెట్‌ చేయలేదు: ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌

ISRO chief Somanath: తన స్వీయ జీవిత చరిత్రపై రాసిన పుస్తకంలో ఏ వ్యక్తినీ టార్గెట్‌ చేయలేదని ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ వెల్లడించారు. కేవలం తాను ఎదుర్కొన్న సవాళ్లను మాత్రమే పేర్కొన్నానని తెలిపారు. అసలేం జరిగిందంటే..?

Published : 04 Nov 2023 17:30 IST

తిరువనంతపురం: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్ (ISRO chief Somanath) ఆటోబయోగ్రఫీ (autobiography) త్వరలో మార్కెట్లోకి రానుంది. ‘నిలవు కుడిచ సింహంగళ్‌ (వెన్నెలను తాగుతున్న సింహం)’ పేరుతో రాసిన ఈ పుస్తకంలో తన జీవన ప్రయాణంలోని ముఖ్యమైన ఘట్టాలను పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే క్రమంలో తనకు ఎదురైన అనేక సవాళ్లను సోమనాథ్ వివరించారు.

దీంతో ఇస్రో మాజీ చీఫ్‌ కె.శివన్‌ (K Sivan)ను ఉద్దేశిస్తూ సోమనాథ్ తన ఆత్మకథలో కీలక విమర్శలు చేశారని వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై తాజాగా స్పందించిన సోమనాథ్.. ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ‘‘ఒక సంస్థలో ఉన్నత హోదాకు చేరుకునే ప్రయాణంలో ప్రతి ఒక్కరూ కొన్ని రకాల సవాళ్లను దాటాల్సి ఉంటుంది. నా జీవితంలోనూ అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక కీలక పదవి కోసం ఎక్కువ మంది అర్హులు అయి ఉండొచ్చు. ఆ విషయాన్నే నేను పుస్తకంలో ప్రస్తావించాను. అంతేగానీ.. నేను ఏ వ్యక్తినీ టార్గెట్ చేసి విమర్శలు చేయలేదు’’ అని సోమనాథ్‌ స్పష్టం చేశారు.

బస్‌ టికెట్‌ కొనలేక పాత సైకిల్‌పైనే కాలేజీకి..: ‘ఆత్మకథ’లో ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌

ఇక, తన పుస్తకంలో చంద్రయాన్‌-2 వైఫల్యాన్ని కూడా ప్రస్తావించినట్లు ఇస్రో చీఫ్‌ వెల్లడించారు. చంద్రయాన్‌-2 మిషన్‌ వైఫల్యంపై ప్రకటనలో కొంత స్పష్టత లోపించిందన్నారు. అది క్రాష్‌ ల్యాండ్‌ అవుతుందని స్పష్టంగా ప్రకటించలేదన్నారు. ‘‘వాస్తవంగా ఏం జరిగిందో చెప్పడమే సరైన పద్ధతి అని నేను నమ్ముతాను. ఇది సంస్థలో పారదర్శకతను పెంచుతుంది. అందుకే, ఈ విషయాన్ని నేను పుస్తకంలో ప్రస్తావించాను’’ అని సోమనాథ్‌ వివరించారు.

అయితే, ఈ పుస్తకం ద్వారా తన జీవిత ప్రయాణంలో జరిగిన విషయాలను పాఠకులకు వివరించడం తన ఉద్దేశం కాదని ఇస్రో చీఫ్‌ అన్నారు. జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూనే.. తమ తమ స్వప్నాలను సాకారం చేసుకోవాలని ప్రేరేపించడం కోసమే ఈ ఆత్మకథ రాసినట్లు సోమనాథ్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని