ISRO: బస్‌ టికెట్‌ కొనలేక పాత సైకిల్‌పైనే కాలేజీకి..: ‘ఆత్మకథ’లో ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌

ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ (S Somnath) మలయాళంలో ‘నిలవు కుడిచ సింహంగళ్‌’ పేరిట రాసిన తన ఆత్మకథ (Autobiography) ఈ ఏడాది నవంబరులో విడుదల కానుంది.

Published : 26 Oct 2023 01:52 IST

తిరువనంతపురం: అంతరిక్ష రంగంలో ఘన విజయాలతో ఇస్రో (ISRO) దూసుకెళ్తోంది. శాస్త్రవేత్తగా, ప్రస్తుతం  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్‌గా ఎస్‌.సోమనాథ్‌ (S Somnath) కీలక పాత్ర పోషిస్తున్నారు. కేరళలోని అళప్పుళ జిల్లాలో ఓ గ్రామంలో జన్మించిన సోమనాథ్‌.. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతిష్ఠాత్మక ‘ఇస్రో’ బాధ్యతలు చేపట్టడం వరకు ఆయన జీవన ప్రయాణంలో ఎన్నెన్నో ముఖ్యమైన ఘట్టాలు.. మరెన్నో కీలక నిర్ణయాలు. అవి ఎందరికో స్ఫూర్తిదాయకం. ఈ నేపథ్యంలోనే తన ఆత్మకథను (Autobiography) అక్షరబద్ధం చేసేందుకు సోమనాథ్‌ ముందుకొచ్చారు. మలయాళంలో ‘నిలవు కుడిచ సింహంగళ్‌’ ( వెన్నెలను తాగుతున్న సింహం) పేరిట రాసిన ఈ పుస్తకం ఈ ఏడాది నవంబరులో విడుదల కానుంది.

‘ఈ పుస్తకం ద్వారా నా జీవిత ప్రయాణంలో జరిగిన విషయాలను పాఠకులకు వివరించడం నా ఉద్దేశం కాదు. జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూనే.. తమ తమ స్వప్నాలను సాకారం చేసుకోవాలని ప్రేరేపించడం మాత్రమే’ అని ఎస్‌. సోమనాథ్ చెప్పారు. తన గ్రామీణ నేపథ్యాన్ని గుర్తుచేసుకుంటూనే.. ఈ దేశం తనకు అపారమైన అవకాశాలను అందించిందన్నారు. ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించానని, ఇలాంటి నేపథ్యాల నుంచి వచ్చిన చాలా మందికి ఈ పుస్తకం స్ఫూర్తినివ్వడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

NCERT: పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో ‘భారత్‌’..?

రాకెట్ తయారీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్ III, చంద్రయాన్-3 మిషన్‌ తదితర అంతరిక్ష మిషన్‌ల అనుభవాలు, ఇస్రోలో తన ప్రయాణాన్నీ ఈ పుస్తకంలో సోమనాథ్‌ పొందుపరిచినట్లు సమాచారం. ముఖ్యంగా కాలేజీ రోజుల్లో హాస్టల్‌ ఫీజు లేదా బస్సు ఛార్జీలకు డబ్బులు ఉండేవి కాదట. దీంతో పాత సైకిల్‌పైనే కాలేజీకి వెళ్లేవారట. డబ్బుల్లేకపోవడంతో ఓ చిన్న హోటల్‌ రూమ్‌లోనే ఉండేవారట. అంతేకాదు కుటుంబంలో ఆర్థిక సమస్యల కారణంగా స్టడీ టూర్‌లకు వెళ్లకపోయేవారని తన ఆత్మకథలో ప్రస్తావించినట్లు సమాచారం.

కొల్లంలో టీకేఎం కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన సోమనాథ్‌.. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ సైన్స్‌లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. అనంతరం 1985లో విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్‌ (VSSC)లో చేరిన సోమనాథ్‌.. ఉపగ్రహ వాహకనౌకల డిజైనింగ్‌లో కీలక పాత్ర పోషించారు. 2010 నుంచి 2014 వరకు జీఎస్‌ఎల్వీ మార్క్‌- III ప్రాజెక్టు డైరెక్టర్‌గా.. ఉపగ్రహాల అభివృద్ధికి సంబంధించిన పలు హోదాల్లో పనిచేశారు. వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్‌గానూ కొనసాగారు. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్‌గా ఉన్నారు. తాను మలయాళీ కావడంతో.. మాతృభాషలో రాయడం మరింత సౌకర్యంగా ఉంటుంది కాబట్టి పుస్తకాన్ని అదే భాషలో రాసినట్లు సోమనాథ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని