Hijab Row: సుప్రీంకోర్టుకు హిజాబ్‌ వివాదం.. హైకోర్టు తీర్పులో కీలకాంశాలు ఇవే..!

హిజాబ్‌ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలయ్యింది.

Published : 15 Mar 2022 21:07 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిజాబ్‌ అంశం మరోసారి భారత అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. హిజాబ్‌ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలయ్యింది. కర్ణాటకలోని ఉడుపికి చెందిన ఆరుగురు ముస్లిం విద్యార్థినిలు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై కర్ణాటక ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. స్కూల్‌ యూనిఫాంపై విద్యా సంస్థల నిబంధనలను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఉద్ఘాటించింది. హిజాబ్‌ ధరించడం ఇస్లాం మత ఆచారంలో తప్పనిసరి కాదనే విషయాన్ని స్పష్టంచేసిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది.

తీర్పులో కీలకాంశాలు..

‘ఉపాధ్యాయులు, విద్య, యూనిఫాం అనేవి లేకుండా పాఠశాల విద్య అసంపూర్ణమే. ఈ నేపథ్యంలో ఏకరూప దుస్తులు ధరించాలని చెప్పడం సహేతుకమైనదే. ఇందుకు విద్యార్థులు కూడా అభ్యంతరం చెప్పలేరు. మొఘల్‌ లేదా బ్రిటీష్‌ వారు ఈ విధానాన్ని తీసుకురాలేదు. పురాతన కాలంలో ‘గురుకుల’ రోజుల నుండే ఏకరూప దుస్తుల పద్ధతి ఉంది. అనేక భారతీయ గ్రంథాల్లోనూ వీటి గురించి ప్రస్తావన ఉంది. ఒకవేళ హిజాబ్‌ను అనుమతిస్తే విద్యార్థులందరి యూనిఫాం ఒకే రకంగా ఉండదు. బాలికల్లోనూ హిజాబ్‌ ఉన్నవారు, లేనివారు అనే రెండు వర్గాలుగా అవుతుంది. అటువంటి విభజన రేఖలకు తావులేకుండా ఉండేందుకే పాఠశాలల్లో యూనిఫాం నిబంధన అమలు చేస్తారు. విద్యార్థులు దీనిని తప్పకుండా పాటించాల్సిందే. అంతేకాకుండా శాంతి, సామరస్యాలకు భంగం కలిగించే వస్త్రధారణను నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉంది’ అంటూ కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తాజా తీర్పులో వెల్లడించింది.

ఇదిలాఉంటే, విద్యాసంస్థల్లో హిజాబ్‌ వస్త్రధారణపై గత నెల కర్ణాటకలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పలు జిల్లాల్లో హిజాబ్‌కు మద్దతుగా- వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. ఇదే సమయంలో హిజాబ్‌ వస్త్రధారణకు అనుమతి ఇవ్వాలంటూ పలువురు విద్యార్థినులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తొలుత జస్టిస్‌ కృష్ణ దీక్షిత్‌ ఏకసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించగా.. ఆ తర్వాత విచారణను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. దీనిపై పదిహేను రోజుల పాటు వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. ఫిబ్రవరి 25న విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా హిజాబ్‌ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదంటూ తుది తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్లు భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని